హున్సాలో పిడిగుద్దుల వర్షం | Hunsa punches | Sakshi
Sakshi News home page

హున్సాలో పిడిగుద్దుల వర్షం

Mar 25 2016 3:39 AM | Updated on Sep 3 2017 8:29 PM

హున్సాలో పిడిగుద్దుల వర్షం

హున్సాలో పిడిగుద్దుల వర్షం

హోలీ పండగ వేళ కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో ....

బోధన్: హోలీ పండగ వేళ కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠ మధ్యసాగింది. సాయంత్రం 15 నిమిషాల పాటు పిడిగుద్దులాట ఆడారు. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఐదారు ఫీట్ల ఎత్తులో ఉన్న స్తంభాలు ఏర్పాటు చేసి, మధ్యలో బలమైన తాడును కట్టారు. బుధవారం రాత్రి కాముని దహనంతో హోలీ సంబరాలు ప్రారంభించారు. గురువారం ఉదయం రంగులాడారు. సాయంత్రం 4.30 గం.కు కుస్తీ పోటీలు నిర్వహించి అనంతరం పిడిగుద్దులాటకు సిద్ధమయ్యారు. గ్రామస్తులు మొదట డప్పువాయిద్యాలతో గ్రామ పెద్దల ఇంటింటి వెళ్లి వేదిక వద్దకు పిలుచుకుని వచ్చారు. గ్రామ పెద్దలు వేదిక వద్దకు చేరుకోగానే పిడిగుద్దులాట ప్రారంభించారు.


తాడుకు ఇరువైపుల ముందువరుసలో ఉన్న గ్రామస్తులు ఎడమచేతితో తాడును పట్టుకుని కుడిచేతితో పిడికిలి బిగించి ప్రత్యర్థులపై బాధారు. ఒకరినినొకరు బిగి పిడికిలితో కొట్టుకున్నారు. ఆట ముగిసినంతరం తాడు ఇరువైపుల మోహరించిన గ్రామస్తులు ఒకరినొకరు ఆలంగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, గతంలో పిడిగుద్దులాట గంటపాటు కొనసాగేది. పోలీసు అధికారుల సూచన మేరకు ప్రతి ఏటా సమయాన్ని కుదిస్తున్నారు. ఈ సందర్భంగా బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ వెంకన్న నేతృత్వంలో బందో బస్తు నిర్వహించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement