హెచ్‌ఎండీఏపై కాసుల వర్షం 

Huge money to the HMDA - Sakshi

ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు కలపి రూ.928 కోట్ల ఆదాయం 

లక్ష దరఖాస్తులకు ఆమోదముద్ర, 75వేలకుపైగా తిరస్కరణ 

గడువు పెంచితే మరో రూ.150 కోట్లు వచ్చే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌ : అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)తో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)పై కాసుల వర్షం కురిసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటివరకు ఏకంగా రూ.928 కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల రూపంలో రూ.695 కోట్లు, నాలాల ఫీజు రూపంలో రూ.233 కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలో వచ్చి చేరాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు క్లియర్‌ అయిన వారిలో మరో 18,500 మంది ఫీజు కట్టాల్సి ఉండటం, పరిశీలనలో ఉన్న వందల సంఖ్యలో దరఖాస్తులు క్లియర్‌ అయితే మరో రూ.150 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సహకారంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల స్వీకరణ, ఆమోదం అంతా పారదర్శకంగా జరిగిందని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు తెలిపారు.  

మరో రూ.150 కోట్లు వచ్చే అవకాశం... 
హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్లీ 2016 డిసెంబర్‌లో 20 శాతం అధిక రుసుముతో క్రమబద్ధీకరించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఇలా పాతవి, కొత్తవి కలిపి మొత్తం దరఖాస్తులు 1,75,612కు చేరాయి. టైటిల్‌ క్లియరెన్స్, టెక్నికల్‌ స్క్రూటిని, సైట్‌ ఇన్‌స్పెక్షన్, ఫైనల్‌ ప్రాసెసింగ్‌ ఇష్యూ... ఇలా నాలుగు దశల్లో లక్ష దరఖాస్తులను ఆమోదించారు. ప్రభుత్వ భూములు, సీలింగ్, శిఖం, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్స్‌ తదితర స్థలాల్లో ఉన్నాయనే వివిధ కారణాలతో 75,612 దరఖాస్తులను తిరస్కరించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు   చెల్లింపునకు సోమవారం చివరి రోజు కావడంతో చాలా మంది ఫీజు చెల్లించారు. అయితే హెచ్‌ఎండీఏకు మరో రూ.150 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఎల్‌ఆర్‌ఎస్‌   క్లియరెన్స్‌ గడువు పెంచే అవకాశం ఉండొచ్చని   అధికారులు భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top