క్యాబ్‌ సంస్థల గ‘లీజు’!

how cab services lease companies cheating government - Sakshi

ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేతలు.. ఖజానాకు రూ. వందల కోట్లలో నష్టం

హైదరాబాద్‌లోనే 500కిపైగా రిజిస్టర్డ్‌ సంస్థలు

బడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో లీజు ఒప్పందాలు

ఏటా వందల కోట్ల టర్నోవర్‌.. పన్ను కట్టకుండా ఎగవేత

పదేళ్లుగా వ్యాపారం చేస్తున్నా.. ఏడాదికే పన్ను కట్టిన ఓ సంస్థ

పన్నుల శాఖ అధికారికి రూ. కోటి ముడుపులు

విషయం బయటపడినా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌ : అదో క్యాబ్‌ సేవల సంస్థ.. ఏటా కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తోంది.. ఆ వ్యాపారంపై ప్రభుత్వానికి పన్ను ఎగవేసింది.. రిజిస్ట్రేషన్‌నే రద్దు చేసుకుని, పన్ను మాటెత్తకుండా పోయింది.. మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంది.. మళ్లీ కోట్లు ఎగవేసింది.. మళ్లీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకుని కొత్త అవతారం ఎత్తింది.. ఇలా ఒకటికాదు రెండు కాదు వందల సంఖ్యలో క్యాబ్‌ నిర్వహణ సంస్థలు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. ముడుపులకు మరిగిన పన్నుల శాఖ అధికారుల సహకారంతో రూ.వందల కోట్ల మేర ఖజానాకు తూట్లు పొడుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే ఈ తరహా ఉదంతం బయటపడినా, రూ.కోటి ముడుపులు తీసుకున్న అధికారి దొరికినా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఏళ్లుగా ఎగవేతలే..
హైదరాబాద్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు తీసుకొచ్చేందుకు, ఇళ్ల వద్ద దింపేసేందుకు క్యాబ్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఇలా సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పదుల కోట్ల రూపాయల్లో టర్నోవర్‌ చేసే రిజిస్టర్డ్‌ క్యాబ్‌ సంస్థలుహైదరాబాద్‌లో 500కిపైగా ఉన్నట్లు అంచనా. వాటి ద్వారా కోట్ల రూపాయల పన్ను ప్రభుత్వానికి సమకూరాల్సి ఉంది. ఉద్యోగులను తరలించడం ద్వారా క్యాబ్‌ సంస్థలు ఆర్జించే మొత్తం ఏడాదికి రూ.40 లక్షలు దాటితే.. ఆ దాటిన మొత్తంలో 5 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్‌ (సేవాపన్ను) కింద చెల్లించాలి. కానీ చాలా క్యాబ్‌ సంస్థలు ఏళ్లుగా ఈ పన్ను సొమ్మును ఎగ్గొడుతూనే వస్తున్నాయి. ఇందుకోసం కొత్తకొత్త మార్గాలనూ అనుసరించాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం చేకూరింది.

ఆరేళ్ల పాటు ఆడిట్‌కు అవకాశమున్నా..
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర పన్నులన్నీ కలసి జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో క్యాబ్‌ సంస్థలు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ గత కొన్నేళ్లుగా ఎగవేసిన వందల కోట్ల రూపాయల పన్నుల సంగతేమిటన్నది ఇప్పుడు తెరపైకి వస్తోంది. వ్యాట్‌ కింద కట్టాల్సిన ఆ పన్నుల సొమ్మును ఇప్పటికైనా వసూలు చేసే అధికారం పన్నుల శాఖ అధికారులకు ఉంది. ఏ సంస్థ టర్నోవర్‌నైనా ఆడిట్‌ చేసి పన్ను రాబట్టే అధికారం ఆరేళ్ల పాటు ఉంటుంది. అంటే గత ఆరేళ్లకు సంబంధించిన పన్ను ఎగవేతలను ఇప్పుడు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే.. జీఎస్టీ అమల్లోకి వచ్చిందే అదనుగా కొన్ని క్యాబ్‌ సంస్థలు, కొందరు పన్నుల శాఖ అధికారులు కలసి ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్నారు. ఇటీవల ఓ బడా క్యాబ్‌ సంస్థ తాను పదేళ్లుగా చేసిన వ్యాపారాన్ని పక్కకు పెట్టి కేవలం ఒకే ఒక్క ఏడాది వ్యాపారాన్ని మదింపు చేసి, ఆ మొత్తానికి పన్ను కట్టి చేతులు దులుపుకొంది. ఇందుకు సహకరించిన పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరికి రూ.కోటి ముడుపుగా సమర్పించుకుంది. కానీ ఈ విషయం బయటపడడంతో క్యాబ్‌ సంస్థల అక్రమాలు తెరపైకి వచ్చాయి. అయినా ఉన్నతాధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

రిజిస్ట్రేషన్‌.. రద్దు.. ఎగవేత
ఏటా కోట్ల రూపాయలు టర్నోవర్‌ చేసే క్యాబ్‌ సంస్థలు పన్ను ఎగ్గొట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ముఖ్యంగా సంస్థ రిజిస్ట్రేషన్‌ను రెండు, మూడేళ్లు కొనసాగించి రద్దు చేసుకుంటున్నాయి. ఆ రెండు, మూడేళ్ల పన్నును తూతూమంత్రంగా చెల్లిస్తున్నాయి. మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నాయి. దాంతో గతానికి సంబంధించిన పన్ను వ్యవహారం పక్కన పడిపోతోంది. ఈ కొత్త రిజిస్ట్రేషన్‌ను కూడా కొన్నాళ్లు కొనసాగించడం.. పన్ను ఎగ్గొట్టి రద్దు చేసుకోవడం.. మరోసారి కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా పన్నుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదేమంటే.. తాము జీఎస్టీ పనిలో తీరికలేకుండా ఉన్నామని, తమకు పన్ను వసూలు ఆదేశాలేమీ రాలేదని చెబుతూ తప్పించుకుంటున్నారు. అసలు జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. గత ఆరేళ్లకు సంబంధించిన సంస్థల ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ చేసి పన్నులు రాబట్టే వెసులుబాటు ఉంది. అయినా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో వ్యాట్‌ కింద రావాల్సిన కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. క్యాబ్‌ సంస్థల అక్రమాల ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి.. పన్ను రాబడతారా, యథాతథంగా చూసీచూడనట్టు ఊరుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top