వీధిన పడ్డ హోంగార్డులు! | Home Guards in bad situation from last 8 months of losing their salary | Sakshi
Sakshi News home page

వీధిన పడ్డ హోంగార్డులు!

Sep 13 2018 1:42 AM | Updated on Sep 13 2018 1:42 AM

Home Guards in bad situation from last 8 months of losing their salary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీతమొస్తే కానీ నెలగడవని కుటుంబాలు వారివి. అలాంటి వారు 8 నెలలుగా జీతభత్యాల్లేక రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చింది. కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయాల్సి రావడమే వారి పాలిట శాపమైంది. రాష్ట్ర విభజన సమయం (2014)లో 40 మంది హోంగార్డులను ఏపీ సీఐడీ కార్యాలయానికి పంపిస్తూ ఉమ్మడి రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణకు చెందిన హోంగార్డులు ఏపీలో కొన్నాళ్ల పాటు పనిచేయాల్సి వచ్చింది. తాము తెలంగాణ వాళ్లమని, తమను అక్కడికే పంపాలని కోరగా.. కొన్నాళ్ల పాటు పనిచేయాలని ఏపీ పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో దాదాపు మూడున్నరేళ్ల పాటు విధులు నిర్వర్తించారు.

ఏపీలోని అమరావతి సీఐడీ కార్యాలయంలో పనిచేసిన వీరిని ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణకు పంపిస్తూ ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని సైబరాబాద్‌లోని హోంగార్డుల కమాండెంట్‌కు అటాచ్‌ చేశారు. అయితే రిపోర్ట్‌ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోకపోవడంతో 40 మంది హోంగార్డులు ఆందోళనలో పడ్డారు. హోంమంత్రితోపాటు డీజీపీ, ఇతర అధికారులను కలసినా లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. తమకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆరా తీస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించేందుకు బడ్జెట్‌ రాలేదని.. ప్రస్తుతం ఖాళీలు కూడా లేవని చెప్పడంతో హోంగార్డులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇంకా ఎన్నాళ్లు అధికారుల చుట్టూ తిరగాలని వారు ఆవేదన చెందుతున్నారు. 

కుటుంబాల్లో దైన్యం.. 
8 నెలలుగా ఈ 40 మంది హోంగార్డులకు జీతాలు అందకపోవడంతో ఆ కుటుంబాలన్ని దీనస్థితికి చేరు కున్నాయి. అప్పులు చేసి కుటుంబాల్ని పోషిం చుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఓ వైపు ఆర్థిక సమస్యలకు తోడు మరోవైపు మానసిక ఒత్తిడికిలోనై కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే రంగారెడ్డి జిల్లా పాలమాకులకు చెందిన హోంగార్డు శ్రీశైలం తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం మృతి చెందాడు. రెండు నెలల క్రితమే అతడి పెద్ద కూతురు డెంగ్యూ బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో మృత్యువాత పడింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీశైలం అనారోగ్యంతో మరణించాడు. దీంతో సోమవారం హోంగార్డులంతా ఆయన అంత్యక్రియలు నిర్వహిం చారు.

తమలో ఇంకెంత మంది ఇలా బలి అవ్వాలో అంటూ వారు కన్నీరుమున్నీరయ్యారు. చనిపోయిన హోంగార్డు కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. హోంగార్డు మృతి వార్త తెలుసుకున్న సైబరాబాద్‌ రిజర్వ్‌ పోలీసులు రూ.10 వేలు సాయం అందించారు. తమకు వెంటనే బడ్జెట్‌ మంజూరు చేసి విధుల్లోకి తీసుకోవాలని 40 మంది హోంగార్డులు డిమాండ్‌ చేశారు. 8 నెలల జీతాలు విడుదల చేస్తే అప్పులు తీర్చుకొని కుటుంబాలను పోషించుకుంటామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీస్‌ శాఖ ఇప్పటికైనా తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement