ఆర్టీసీపై ఆర్థిక భారానికి డీజిల్‌ రేట్లే కారణం

Hike In Diesel Price Leads Financial Burden On RTC - Sakshi

సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ సంస్థపై ఆర్థిక భారం పెరగడానికి ప్రభుతమే డీజిల్ రేట్లను పెంచడమే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలోని కార్మికులను కలిసిన జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు టీఆర్‌ఎస్‌ మినహా అన్ని పార్టీలు, ప్రజల మద్దతు ఉందన్నారు. చట్ట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను తొలగించే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. డీజిల్ పెంపుతో.. ఆర్టీసీ సంవత్సరానికి రూ.720 కోట్లు నష్టపోతోందని అన్నారు. బస్ పాసుల పేరిట సంవత్సరానికి రూ. ఐదు వందల కోట్లకు పైగా ఆర్టీసీ పై భారం పడుతుందన్నారు.

రాష్ట్రం అవతరించినప్పటి నుంచి కేసీఆర్‌ రూ. 3 లక్షల 15 వేల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. తెలంగాణలోని ప్రతి బిడ్డపై రూ. 80 వేలు అప్పు ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వయసులో చిన్నవాడైన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఉద్యోగులను డిస్మిస్ చేసే హక్కు కేసీఆర్‌కు లేదని, కేసీఆర్‌నే ప్రజలు డిస్మిస్ చేసే సమయం ఆసన్నమైందన్నారు. కోర్టు ధిక్కరణ కేసులో లాలు ప్రసాద్, హరియాణా సీఎం మాదిరే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉందని, అవినీతి లేని ఒకే ఒక్క శాఖ ఆర్టీసీ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆరే చెప్పారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు నెలకు రూ. 50 వేలు జీతం వస్తుందని.. కేసీఆర్‌ చెప్పడం సిగ్గు చేటన్నారు. సమ్మె చేయాలని ఎవరు కోరుకోరని, సమ్మె అనేది కార్మికుల చివరి అస్త్రమని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఆర్టీసీని ప్రయివేటు పరం చేయాలని కుట్రలు పన్నుతున్నారని, కార్మికులను రోడ్డుకు ఇడ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఆర్టీసీ స్థలాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడం కేవలం కమిషన్ కోసమేనని విమర్శించారు. కేసీఆర్ చుట్టాలకే 60 శాతం రాయితీ కల్పించి.. బస్సును మాత్రం కార్మికులకు ఇస్తున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఒక కల్వకుంట్ల కుటుంబమే అనుభవిస్తుందన్నారు. బుల్లెట్‌ ప్రూఫ్ బాత్రూమ్‌లు కట్టుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని హేళన చేశారు. హూజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీది గెలుపు కాదు బలుపని.. వచ్చే ఎన్నికల్లో బలుపు ప్రజలు తగ్గిస్తారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top