బెట్టు వద్దు..మెట్టు దిగండి

High Court Suggest To TSRTC JAC Over TSRTC Strike - Sakshi

ఆర్టీసీ సమ్మెపై ఇరు వర్గాలకు హైకోర్టు సూచన

చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ఇరు వర్గాలు పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించాలని, ఇద్దరూ ఒక మెట్టు దిగాలని హైకోర్టు సూచించింది. అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోతే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్చల ప్రక్రియను పర్యవేక్షించాలని, చర్చల ద్వారానే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలన్న ఈ నెల 18 నాటి హైకోర్టు ఉత్తర్వులు మంగళవారం అధికారికంగా వెలువ డ్డాయి.

ఆ ఉత్తర్వుల ప్రతి ప్రభుత్వానికి అందింది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్, జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ (ప్రస్తుతం ఇన్‌చార్జి ఉన్నారు) చర్చలు జరపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలు ఫలప్రదమై ఆర్టీసీ సమ్మె విరమణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. సమ్మెలోకి వెళ్లిన కార్మిక సంఘాలు లేవనెత్తిన పలు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడినవి కావని, వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరిపి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

కోర్టు న్యాయపరిధికి లోబడి ఉంది..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఆర్థిక అంశాలను సంబంధం లేనివాటిని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడదని వ్యాఖ్యానించింది. ఆర్థిక అంశాలతో ముడిపడిన కొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా, చట్టపరంగా చెల్లించాల్సినవేనని పేర్కొంది. ‘‘రాజ్యాంగంలోని 14, 15, 16, 19, 21 అధికరణాల ప్రకారం ఈ డిమాండ్లు ఆమోదించదగ్గవని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ చట్టం 1950లోని సెక్షన్‌ 19(1)(సి), ఇతర సెక్షన్ల ప్రకారం ఆర్టీసీ సిబ్బందికి పని చేసేందుకు ఆరోగ్యకర వాతావరణం, తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉంది.

కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించే నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టు తన న్యాయ పరిధికి లోబడి ఉంది. అందుకే యూనియన్, జేఏసీల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రానికి గానీ కార్పొరేషన్‌కు గానీ ఆదేశాలు ఇవ్వడం లేదు. సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. రాష్ట్రంలోని పురుషులు, మహిళలు, పిల్లలను దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా చర్చలు జరపాలని ఆదేశిస్తున్నాం. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలపై సానుకూల సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం’’అని హైకోర్టు తన 14 పేజీల మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top