కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను నిలిపేయండి | Sakshi
Sakshi News home page

కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను నిలిపేయండి

Published Sun, Jul 1 2018 2:26 AM

High Court Stay Order On Telangana Police Conistable Recruitment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, వెంటనే ఆ ఉత్తర్వులను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వివిధ విభాగాల్లోని 16,925 పోస్టుల భర్తీకి మే 10న జారీ చేసిన జీవో 49 ప్రకారం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలని మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం లక్ష్మీసాగర్‌ గ్రామస్తుడు మహేశ్‌ కోర్టును ఆశ్రయించారు. ‘నియామక ప్రక్రియ షరతులు లోపభూయిష్టంగా ఉన్నాయి. స్పెషల్‌ పోలీస్, ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ తదితర విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల అభ్యర్థులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వాళ్లకు 3 మార్కుల వెయిటేజీ ఇవ్వడం చట్ట వ్యతిరేకం.

ఇది ఏపీ పోలీస్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధం. అంతేకాకుండా హోంగార్డులకు వయోపరిమితి పెంపు ప్రభావం రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు నష్టం చేకూరుస్తుంది. జిల్లాలు, కమ్యూనిటీల వారీగా రోస్టర్‌ ప్రకటించలేదు. కొన్ని కేటగిరీ అభ్యర్థుల్ని పట్టించుకోలేదు. కాబట్టి నియామక ప్రకటన అమలును నిలిపివేయాలి’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.     

Advertisement
Advertisement