
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎవరో తెలియకుండా సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలని ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐటీసీసీ)ను హైకోర్టు ప్రశ్నించింది. హిందూ జనశక్తి, శివశక్తిలకు చెందిన వారు ఏపీ, తెలంగాణాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పలు పోలీసు స్టేషన్లలో ఉన్న కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ విశాఖలోని మాధవధారకు చెందిన కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలకలూరి సత్యశీలరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వారిని వ్యాజ్యంలో పేర్కొనకుండా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. శివశక్తి, హిందూ జనశక్తిలను ప్రతివాదులుగా చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.