అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. క్రైస్తవులను అన్యాయంగా చంపేస్తూ చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపిస్తూ ఆఫ్రికన్ దేశం నైజీరియాపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనిక చర్య తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యే నైజీరియాను అమెరికా ‘కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్’ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసపై తీవ్రంగా స్పందించారు. ఫ్లోరిడాలో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. నైజీరియాలో క్రైస్తవులను రికార్డు స్థాయిలో హత్య చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలోనే చంపుతున్నారు. నైజీరియాలో క్రైస్తవులు తీవ్ర ముప్పులో ఉన్నారు. ఇక మీదట అలా జరగనివ్వబోను. అవసరమైతే అమెరికా బలగాలను మోహరిస్తాం. వైమానిక దాడులు జరుపుతాం. ఇప్పటికే యుద్ధ విభాగానికి(Department of War) ఆదేశాలు కూడా జారీ చేశాను’’ అని తీవ్ర హెచ్చరికలే జారీ చేశారాయన. అంతకు ముందు..
శుక్రవారం కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. నైజీరియాలో క్రైస్తవత్వం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ హింసకు రాడికల్ ఇస్లామిస్టులు కారణమని ఆయన ఆరోపించారు. ఇది ఆగకపోతే నైజీరియాకు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరిస్తూనే.. గన్స్-అ-బ్లేజింగ్ అంటూ అమెరికా సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు.
సీపీసీ అంటే..
తాజాగా నైజీరియాను కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్(CPC) జాబితాలో చేర్చారు. ఆ వెంటనే ఆ జాబితా వెలువడడం గమనార్హం. సీపీసీని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తయారు చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (International Religious Freedom Act - IRFA) 1998 ప్రకారం.. ప్రతి ఏటా ఈ జాబితాను రివైజ్ చేస్తుంటారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి (U.S. Secretary of State) ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.
ఈ జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాలు ఉంటాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననంలాంటి అంశాల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల మినహాయింపులు ఇవ్వవచ్చు. నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
నైజీరియా స్పందన
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు బోలా టిన్బు వ్యాఖ్యానించారు. అయితే.. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వాలని కోరారు. ‘‘ఆయన నైజీరియా పట్ల సానుకూలంగా ఉన్నారనే భావిస్తున్నాం. ఇరు దేశాధినేతలు కూర్చుని మాట్లాడుకుంటే.. ఉగ్రవాదాన్ని అణచివేయడం అంత కష్టమేమీ కాదు. ఆయన్ని త్వరలోనే మా అధ్యక్షుడు కలవాలనుకుంటున్నారు’’ అంటూ అధ్యక్ష సలహాదారు డేనియల్ బ్వాలా చెబుతున్నారు.
నైజీరియాలో ఏం జరుగుతోందసలు..
నైజీరియాలో బోకోహరాం, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్( ISWAP) వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు గత కొంతకాలంగా హింసాత్మక చర్యలు కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు రైతులు గొర్రెల కాపరులు మధ్య ఘర్షణలు.. మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్రైస్తవులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా..
ప్లాటూ, బెన్యూ, కడునా రీజియన్లలో క్రిస్టియన్లపై దాడులు పరిపాటిగా మారాయి. నైజీరియన్ సంస్థల కథనాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటిదాకా 600 మంది క్రైస్తవులు దారుణ హత్యకు గురయ్యారు ఇక్కడ. అయితే.. కొన్ని గ్లోబల్ సంస్థలు మాత్రం ఆ సంఖ్య 7,000 దాకా ఉండొచ్చని చెబుతున్నాయి. అలాగే లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంతర్యుద్ధాల కారణంగా అవి ఫలించడం లేదు.


