అందుకు పది రోజుల సరిపోతుంది కదా : హైకోర్టు

High Court Directs TS Govt To File Counter In Intermediate Board Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌ బోర్డు వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జరీ చేసింది. ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్‌ రీ వాల్యువేషన్‌పై ఇంటర్‌ బోర్డు తన నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. అలాగే ఇంటర్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతలపై సోమవారం వరకు కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఇంటర్‌ బోర్డ్‌ వ్యవహారంపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. బాధ్యులపై సెక్షన్‌ 304 ఏ కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కోర్టు విచారించింది.  ఈ సందర్భంగా.. ఇంటర్ ఫలితాలలో వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని అడిషనల్ ఏజీ రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. మొత్తం 9 లక్షల 70 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు.

బోర్డులో ఉన్న లోపాల్ని ఎత్తిచూపండి..
పిటిషనర్‌ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ‘ 16 మంది విద్యార్థులు చనిపోయారు. అయినా ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు స్పందించడం లేదు. ఫలితాలపై జరిగిన అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. 50 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు అని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్యార్థులకు న్యాయం జరగాలంటే బోర్డులో ఉన్న లోపాల్ని ఎత్తి చూపాలని సూచించింది.

తప్పుల్ని సరిచేస్తాం.. ఎంత సమయం కావాలి?
‘వారంలోపు సమస్య పరిష్కరిస్తాం.ఈ ఏడాది 9.7 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ప్రతి ఏడు 30 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రతియేడు 25వేల అప్లికేషన్స్‌ వస్తాయి. అయితే ఈ ఏడాది 9వేల అప్లికేషన్స్ వచ్చాయి. అని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. ఇందుకు స్పందించిన కోర్టు.. 9 లక్షల 70 వేల మందికి 2 నెలల సమయం పడితే.. ఫెయిలైన 3 లక్షల మంది రీవాల్యువేషన్‌కు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. ఇందుకు బదులుగా... రెండు నెలల సమయం పడుతుందంటూ న్యాయవాది బదులిచ్చారు.

ఈ నేపథ్యంలో 3 లక్షల మందికి 10 రోజులు సమయం సరిపోతుందని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో.. వాళ్లంతా భవిష్యత్ ఉన్నవాళ్లు డాక్టర్లు , ఇంజినీర్లు కావాల్సినవాళ్ళు అంటూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ నేరుగా వాదనలు వినిపించగా..  ఫ్యాక్ట్స్ అండ్‌ ఫిగర్స్‌ కాదు సొల్యూషన్ చెప్పాలంటూ కోర్టు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా రెండో రోజు కూడా ఇంటర్‌ బోర్డ్‌ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అక్కడికి భారీ ఎత్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అవతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రీకౌంటింగ్‌కే రేపే చివరి గడువు కావడం.. వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top