
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ లో మహిళా కళాకారుల పై లైంగిక వేధింపుల నివారణ, విచారణ, వారి సంక్షేమం తదితర అంశాలపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశ పురోగతిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమకారిణి సంధ్యారాణి, మహిళా హక్కుల కోసం ఉద్యమించే ఇతరులు దాఖలు చేసిన పిల్ మంగళవారం మరోసారి హైకోర్టు విచారణకు వచ్చింది.
ఈ అంశంపై ఏప్రిల్ 21న మంత్రి సమావేశాన్ని నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సమావేశ పురోగతిని తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తెలుగు ఫిల్మ్ చాం బర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.