
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులుదీరిన వాహనాలు
చౌటుప్పల్/మునిపల్లి: హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి బుధవారం వాహనాలతో రద్దీగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆ రాష్ట్ర ప్రజలు భారీ ఎత్తున సొంతూర్లకు బయలుదేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. విజయవాడ మార్గంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా, అలాగే నార్కట్‌పల్లి – అద్దంకి మార్గంలోని మాడ్గులపల్లి టోల్‌ప్లాజాకు వాహనాలు పోటెత్తాయి. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన వాహనాల రద్దీ బుధవారం ఉదయం 11గంటల వరకు కొనసాగింది. తిరిగి సాయంత్రం 6 గంటలకు మరోసారి వాహనాల రద్దీ ప్రారంభమైంది.
పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో వాహనానికి టోల్‌ప్లాజా దాటేందుకు గంటల సమయం పట్టింది. ప్లాజా సిబ్బంది నేరుగా వాహనదారుల వద్దకే వెళ్లి ఫీజు వసూలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే హైదరాబాద్ – విజయవాడ రహదారిపై సుమారు 30 వేల వాహనాలు అదనంగా వెళ్లినట్టు సమాచారం. గంటల తరబడి టోల్‌ప్లాజా వద్ద వేచి ఉండాల్సి రావడంతో వాహనదారులు సిబ్బందితో గొడవకు దిగారు. రద్దీ సమయంలో ఉచితంగా పంపించాలని, లేకుంటే అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిరసన వ్యక్తంచేశారు . పోలీసులు సముదాయించి వాహనదారులను పంపించారు. కాగా, సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ శివారు వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ నెలకొంది.
బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు