
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, పంజాగుట్టలో కుండపోతగా వర్షం కురిసింది. అమీర్‌పేట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్‌లోనూ వర్షం దంచుతోంది. నగరంలో వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగర వాసులు సాధ్యమైనంతమేర కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగరంలో వరద నీరు నిలిచిపోవడం, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తతతో ఉన్నాయని ఆయన తెలిపారు.