ప్రజలపై భారంలేని పాలన అందిస్తున్నాం: మంత్రి ఈటెల

Health Minister Inaugurates New Hospital In Nizamabad - Sakshi

సాక్షి, బిచ్కుంద(నిజామాబాద్‌) : ఐదేళ్ల వయసున్న రాష్ట్రం అయినప్పటికీ ఉద్యమనేత సీఎం కేసీఆర్‌ సంక్షేమం, అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ప్రజలపై పన్ను ఇతర భారం వేయకుండా సురక్ష, సుభిక్ష పాలన అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం బిచ్కుందలో రూ. 5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని మంత్రులు ఈటల రాజేందర్, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ ప్రారంభించారు. మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ తాగునీటితో ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. 

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని భావించి సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ అడవి బిడ్డల నుంచి బంజారాహీల్స్‌లో నివసిస్తున్న ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ స్వచ్ఛమైన నీటిని అందించారని అన్నారు.  జిల్లా, డివిజన్‌ కేంద్రాలలో డయాలసిస్‌ కేంద్రాలు నెలకొల్పడంతో పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చిన్న రాష్ట్రం ఉన్నప్పటికి మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి ఇతరులకు సీఎం ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 170 కిలోమీటర్లు గోదావరి నీటితో కళకళలాడుతుందన్నారు.  పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నప్పటికి 24 గంటలు కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే మంత్రిని కోరారు. మంత్రి స్పందించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 


సభలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ 

జిల్లాలో రూ.610 కోట్లతో రోడ్లు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి 
కామారెడ్డి జిల్లాకు రూ.610 కోట్ల నిధులు వెచ్చించి గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల వసతి కల్పించామని రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే పట్టుబట్టి ఒక్క జుక్కల్‌ నియోజక వర్గానికే రోడ్ల కోసం రూ.220 కోట్లు  నిధులు మంజూరు చేయించుకున్నారని అన్నారు. జుక్కల్‌ నియోజక వర్గంలో కొన్ని రోడ్లు పూర్తి కాలేదని, బిచ్కుంద, జుక్కల్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ కోసం ఎమ్మెల్యే కోరారని మంజూరుకు హామీ ఇస్తున్నామన్నారు. 

మూడు రాష్ట్రాల ప్రజలకు వైద్యం: ఎమ్మెల్యే సింధే
జుక్కల్‌ నియోజక వర్గంలో కొత్తగా ఆస్పత్రులు నిర్మించడంతో మూడు రాష్ట్రాల ప్రజలకు వైద్యం అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే అన్నారు. మంగళవారం బిచ్కుందలో 30పడకల ఆస్పత్రిని మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిచ్కుందలో ప్రారంభించిన ఆస్పత్రికి, జుక్కల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది వైద్యులు, స్టాఫ్‌ మంజూరు చేయాలన్నారు. చిల్లర్గీ, పెద్ద ఎక్లార, కొమలంచ, మహ్మదాబాద్‌లో కొత్తగా పీహెచ్‌సీలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్‌లో రెగ్యూలర్‌ వైద్యులు, స్టాప్‌ నర్సులు, టెక్నీషియన్‌ లేక వైద్యం కోసం ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయాలని, అలాగే సోస్టుమార్డం గది, ప్రహరి, మద్నూర్‌లో 50 పడకలు, నిజాంసాగర్, పెద్దకొడప్‌గల్‌ 30 పడకలు ఆస్పత్రి కావాలని కోరారు. బిచ్కుంద, జుక్కల్‌లో సెంట్రల్‌ లైటింగ్, ఆయా గ్రామాల్లో రోడ్లు, నియోజక వర్గంలో 162 జీపీలు ఉన్నాయి ఒక్కో గ్రామ పంచాయతికి సీసీ రోడ్ల కోసం రూ.10లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ కోరారు. ఇద్దరు మంత్రులు స్పందించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్‌ జెడ్పీ చైర్మన్లు దఫెదార్‌ శోభా రాజు, విఠల్‌రావు, జేసీ యాదిరెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఆర్డివో రాజేశ్వర్, ఆరు మండల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు అశోక్‌ పటేల్, నాల్చర్‌ భారతి, సర్పంచ్‌ శ్రీరేఖరాజు, నాయకులు వెంకట్‌రావు, నాల్చర్‌ రాజు, సాయిరాం, రాంరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top