‘కాళేశ్వరం’ గుండె.. మేడిగడ్డ పంప్‌హౌస్‌

Harish rao Visit Kaleswaram And Medigadda Projects - Sakshi

మొదటి స్పైరల్‌ కేసింగ్‌ బిగింపు

ఆస్ట్రియా దేశ నిపుణుల

పర్యవేక్షణలో నిర్మాణం

పనులు పరిశీలించిన మంత్రి హరీష్‌రావు

కాళేశ్వరం(మంథని): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ పంప్‌హౌస్‌ గుండెకాయ వంటిదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం ఆయన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ ఎస్‌.మసూద్‌ హుస్సేన్‌తో కలిసి అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు విలేకరులతో మాట్లాడుతూ అత్యంత ప్రధానమైన కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్‌హౌస్‌లో స్పైరల్‌ కేసింగ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్‌హౌస్‌ల్లో మేడిగడ్డ పంప్‌హౌస్‌లో మొదటి స్పైరల్‌ కేసింగ్‌ను బిగించినట్లు తెలిపారు. నీటిని గోదావరి నుంచి మోటార్ల ద్వారా పైపులకు మళ్లించే ప్రక్రియను స్పైరల్‌ కేసింగ్‌ చేస్తుందన్నారు.

ఇలా మొత్తం 11 స్పైరల్‌ కేసింగ్‌లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వీటిని ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన ఇద్దరు నిపుణుల పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పంప్‌హౌస్‌ ద్వారా నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా తరలించనున్నట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తికాకున్నా ఈ పంప్‌హౌస్‌ ద్వారా నీటిని తరలించవచ్చని పేర్కొన్నారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించామన్నారు. అన్నారం బ్యారేజీలో ఇప్పటికే 75శాతం పనులు పూర్తయ్యాయన్నారు. క్రస్టుగేట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే మూడు గేట్ల నిర్మాణం జరిగిందన్నారు. గేట్ల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా త్వరగా పూర్తిచేయాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జూలై చివరికల్లా నీటిని తరలిస్తామని ధీమాతో ఉన్నట్లు తెలిపారు.

మజ్జిగ ప్యాకెట్లు అందించాలి..
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 4.5 నుంచి 46 డిగ్రీల ఎండల్లో పనిచేస్తున్న కార్మికులకు మజ్టిగ ప్యాకెట్లు, గంట విశ్రాంతి ఇవ్వాలని అఫ్‌కాన్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శేఖర్‌దాస్‌కు సూచించారు. అన్నారం బ్యారేజీల్లో సుమారు 2వేల మంది వరకు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారికి పని జరుగుతున్న దగ్గర భోజన వసతి ఏర్పాటు చేయాలని, విశ్రాంతి తీసుకోవడానికి బ్యారేజీ నిర్మాణం వద్ద షెడ్లు నిర్మించాలని ప్రాజక్ట్‌ మేనేజర్‌కు మంత్రి చెప్పారు.

ఆస్ట్రియా నిపుణుడితో ముచ్చటించిన మంత్రి
పంప్‌హౌస్‌లో స్పైరల్‌ కేసింగ్‌ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దీన్ని అమర్చడానికి ఆస్ట్రియా దేశం నుంచి ఇద్దరు నిపుణులు వచ్చారు. ఫీటర్‌ అనే నిపుణుడితో మంత్రి హరీష్‌రావు కాసేపు ముచ్చటించారు. నీకు ఇక్కడ ఎలా ఉంది.. పని ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఫీటర్‌ మాట్లాడుతూ నాకు బాగానే ఉందని, పని స్పీడ్‌గా జరుగుతోందని బదులిచ్చారు. మంత్రి అతడితో పని స్పీడ్‌గా జరగాలి.. అదే సమయంలో క్వాలిటీతో ఉండాలని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్‌ అమయ్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ హరిరామ్, ఆర్టీవో వీరబ్రహ్మచారి, మెగా కంపెనీ సీజీఎం వేణుమాధవ్, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వినోద్, ఆఫ్‌కాన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శేఖర్‌దాస్, డీఈఈ సూర్యప్రకాశ్, యాదగిరి ఉన్నారు. జిల్లా ఓఎస్డీ సురేందర్, డీఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు, సీఐ రమేష్, శంకర్‌రెడ్డి, ఎస్సై నరేష్‌ బందోబస్తు నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top