గంధమల్ల, బస్వాపూర్‌ నిర్వాసితులకు మంచి ప్యాకేజి: హరీశ్‌

Harish Rao Arrange Special Package For Kaleshwaram Project Surrounding People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించ తలపెట్టిన గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్ల నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు రూ. 7.50 లక్షల పరిహారంతోపాటు 250 గజాల స్థలం ఇవ్వాలని సాగునీటి మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. డబుల్‌బెడ్‌ రూం వద్దనే వారికి రూ.12.50 లక్షలతోపాటు 250 గజాల స్థలం ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి ఆయన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవి, ఇతర రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

మెయిన్‌ కెనాల్‌ తవ్వకానికి అవసరమైన 460 ఎకరాలకుగాను 365 ఎకరాల భూమిని సేకరించామని జేసీ రవి వివరించగా, మిగిలిన ఎకరాల భూసేకణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. గంధమల్ల రిజర్వాయర్‌ కింద 2,387 ఎకరాల భూమి పోయే అవకాశం ఉందని రవి చెప్పగా నిర్వాసితులకు మంచి ప్యాకేజి ఇవ్వాలని, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలో నిర్వాసితులయ్యే తిమ్మాపూర్‌ గ్రామస్తులకు కూడా ఇదే ప్యాకేజిని అమలు చేయాలని ఆయన సూచించారు. 

ప్రాజెక్టు భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని, ముందుగా ఏ ప్రాంతంలో నీరందించే అవకాశం ఉందో ఆ ప్రాంతంలో భూసేకరణ చేయాలని సూచించారు. ఆ ప్రాంతంలోని చెరువులను వెంటనే నింపి కొంత ఆయకట్టుకు నీరందించాలని ఆదేశించారు. గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ డ్యామ్‌ అలైన్‌మెంట్‌ కింద ఉన్న భూముల సేకరణపై దృష్టి సారించాలని, కాలువలు, తూముల ద్వారా నీరిచ్చే లా భూముల సేకరణ చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని హరీశ్‌ యాదాద్రి జిల్లా అధికారులను ఆదేశించారు. 

బిల్లులు ఆన్‌లైన్‌లో పొందుపర్చండి 
మిషన్‌ కాకతీయ పనులు పూర్తయిన వెంటనే బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మిషన్‌ కాకతీయ పను ల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు.

డిండి ఫలాలు ఈ ఏడాదే అందాలి 
డిండి ఎత్తిపోతల పథకం తొలి ఫలాలు ఈ ఏడాదే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన గొట్టిముక్కల రిజర్వాయర్‌ ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీరందేలా చూడాలని సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని, కాలువల పనులను అక్టోబర్‌–నవంబర్‌ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లాలోని పలు పథకాలపై హరీశ్‌ జలసౌధలో సమీక్ష నిర్వహించారు.
 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top