వీడియో నిఘాలోనే చెక్కుల పంపిణీ

Gutta Sukhender Reddy On Rythu Bandhu Checks Distribution Programme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకాన్ని ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజురాబాద్‌లో ప్రారంభిస్తారని రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతో కలసి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతు బంధు పథకం వివరాలు తెలియజేశారు. గుత్తా మాట్లాడుతూ.. మొత్తం 1,40,98,486 ఎకారాల వ్యవసాయ భూములకు గాను రైతు బందు పథకం కింద రూ. 5608 కోట్ల పంట సాయాన్ని అందించబోతున్నట్టు ప్రకటించారు. అలాగే కొత్త పాసు పుస్తకాల, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వీడియో రికార్డ్‌ చేయనున్నట్టు తెలిపారు. గల్ఫ్‌లో ఉన్న రైతులకు వారి కుటుంబాలకు చెక్కులను అందిస్తామని పేర్కొన్నారు. ఈ చెక్కుల పంపిణీకి రెండు వేలకు పైగా బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

పాస్‌ పుస్తకాల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లితే రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని వాటిని సవరించే అధికారం జిల్లా కలెక్టర్‌లకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆధార్‌, పాస్‌ పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటర్‌ కార్డు, పాస్‌ బుక్‌లలో ఏది ఉన్న చెక్కులు అందజేస్తామని తెలిపారు. చెక్కులు తీసుకోని వారి చెక్కులను తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేసి, రైతుల సంక్షేమం కోసం వాటిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రైతు బంధు పథకాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అలాగే ఈ పాసు పుస్తకాల ముద్రణలో 80 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. పాసు పుస్తకాల ముద్రణకు 90 కోట్లు కేటాయిస్తే 80 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. చెట్టు కింద ఉన్న వాళ్లకు చెట్టు పైన ఉన్న వాళ్లకు తేడా ఉంటుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top