
వైయస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో మహిళా వ్యతిరేక, ప్రజాకంటక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. కడప వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మహిళలతో సమావేశమైన ఆమె తొలుత వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. రాష్ట్రంలో పార్టీ మహిళా విభాగం చేపట్టాల్సిన అంశాలు, మహిళా సమస్యలపై జిల్లా కమిటీలతో వరుదు కల్యాణి చర్చించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలందరినీ కలుపుకుని మహిళలకు రక్షణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్ హయాంలో మహిళా సానుకూల ప్రభుత్వం నడిచిందని, అన్ని విధాలా మహిళలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచారన్నారు. జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. ఇచిన హామీలు తుంగలో తొక్కారని, అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మహిళలకు రూ. 1500 ఎప్పుడిచ్చారని ప్రశ్నించారు. స్త్రీ శక్తి పేరుతో ఐదు బస్సులకే పరిమితం చేశారని ఆమె ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతి ఎక్కడకు పోయిందని, రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో బాబు టోపీ పెట్టారని కల్యాణి అన్నారు. వికలాంగుల పింఛన్లులో కోత కోయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనుకాడలేదని, తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా అనగలుగుతున్నారని ఆమె నిలదీశారు.ఏ ఒక్క మహిళపై చేయి వేసినా, అదే వారికి చివరి రోజు అని చంద్రబాబు అన్నారని, అయితే ఆయన సొంత ఎమ్మెల్యేలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే నోరు మెదపడం లేదని కల్యాణి ఎద్దేవా చేశారు.
మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో బాహుబలి పాలన అని ఇప్పుడు నరబలి చూపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా వారు నోరు మెదపరన్నారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వినియోగిస్తున్నారన్నారు. మాట్లాడితే రుషికొండ బీచ్ భవనాలు సందర్శించే బదులు సుగాలి ప్రీతి కి న్యాయం చేయవచ్చు కదా? అని ఆమె నిలదీశారు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని, తప్పకుండా మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగుతూనే ఉంటాయన్నారు. మళ్ళీ వైఎస్ జగన్ సీఎం కావాలంటే మహిళలందరూ కంకణం కట్టుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.