Eruvaka pournami సేద్యం ఓ యజ్ఞం | Eruvaka pournami special artical | Sakshi
Sakshi News home page

ఏరువాక పౌర్ణమి : సేద్యం ఓ యజ్ఞం

Jun 11 2025 11:25 AM | Updated on Jun 11 2025 11:25 AM

Eruvaka pournami special artical

వేదాన్నిజీవన విధానంగా మార్చుకున్నారు భారతీయులు. పూజలు, హోమాది క్రతువుల్లో మాత్రమే కాదు, వేద ప్రతిపాదిత వృత్తులనే ఉపాధి మార్గాలుగా ఎంచుకున్నారు. వ్యవసాయం కూడా వేదం సూచించినదే! వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ... తొలకరి జల్లులతో నేలతల్లి పులకరించే క్షణాలివి. రుతుపవనాలు బలపడి, వర్షాలు మొద లవుతాయి. దుక్కి దున్ని పొలం పనులను మొదలుపెట్టడానికి ఇది అనువైన సమయం. అంతేకాదు! అందరూ ఒకే సారి పనులు మొదలుపెడితే వ్యవసాయం కూడా క్రమపద్ధతిలోఉంటుంది. అందుకోసమే జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యవ సాయ పనులను మొదలుపెట్టాలని సూచించి ఉంటారు మన పెద్దలు. ఒక రకంగా ఇది వ్యవసాయానికి ఉగాది లాంటిది. పురాణాల్లోనూ వ్యవ సాయదారులకు సంబంధించిన అనేక విషయాలు చర్చించడం గమనించవచ్చు. 

అగ్ని, వాయు పురాణాల్లో సాగుకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. తొలిసారిగా నాగలిని భూక్షేత్రంలో గుచ్చడానికి ముందు ధరణిపూజ చేయాలని ఋగ్వేదం ఘోషిస్తున్నది. ఆ భూమిపూజ కూడా జ్యేష్ఠపౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ఠ పూర్ణిమను ‘ఏరువాక పున్నమి’ పర్వదినంగా కర్షకులు జరుపుకొంటారు. అధర్వ వేదం ఏరువాకను ‘అనడుత్సవం’గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రా లతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు వంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. ఏరువాక పూర్ణిమను ‘సీతాయజ్ఞం’అనే పేరుతో కూడా జరుపుకొంటారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజనుచేస్తారు. ఈ సమయంలో తమ పొలాల్లో నాగలితో దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. తెలుగు పండుగల్లో సాహిత్య ఆధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది. శ్రీకృష్ణ దేవరాయలకాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన వచ్చింది. పరాశరుడు రాసిన ‘కృషి పరాశరం’ ప్రామాణిక వ్యవసాయ గ్రంథంగా పేర్కొంటారు.  వ్యవసాయ ప్రారంభానికి ముందు నేలను పూజించి, ఆనేల తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండుగైన ఈ ఏరువాకపున్నమిని ఆనందంగా జరుపుకొందాం.

– వాడవల్లి శ్రీధర్‌ 
 (నేడు ఏరువాక పున్నమి)

Advertisement
 
Advertisement
Advertisement