గతంలో ‘పోతిరెడ్డిపాడు’పై మాట్లాడలేదే?

Gutta Sukender Reddy Fires On Congress Party Leaders - Sakshi

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఒక్క మాట మాట్లాడని కాంగ్రెస్‌ నేతలు కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేయడం సిగ్గుచేటని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నపుడే తాను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వ్యతిరేకించిన విషయాన్ని మండలి చైర్మన్‌ గుర్తు చేశారు. తెలంగాణ శాసన మండలి కమిటీ హాల్‌లో శనివారం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలు పరిష్కారం కాకముందే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో పులిచింతలపై సర్వే చేయించిన ఇద్దరు ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నారని, కాంట్రాక్టులు తీసుకున్న కొందరు నేతలు ఆంధ్రా నేతలకు వత్తాసు పలికారని గుత్తా విమర్శించారు. పోతిరెడ్డిపాడు అంశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ.. ఏపీ, తెలంగాణలో వేర్వేరు వైఖరి అవలంబిస్తున్నాయన్నారు.

ఉపవాస దీక్షలతో ఒరిగేదేమీ లేదు
1969 నాటి తెలంగాణ ఉద్యమం మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా నీళ్లు, నిధుల కోసమే జరిగిందని, రెండు గంటల ఉపవాస దీక్షలతో ఒరిగేదేమీ లేదని గుత్తా విమర్శించారు. 203 జీవోను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు రాజకీయాలను వదిలి పోతిరెడ్డిపాడు పనులను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని గుత్తా సూచించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఏపీ, రాయలసీమ వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉండటం వలనే తెలంగాణకు నష్టం కలిగిందని ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top