
టాయిలెట్‌లో తుపాకీ
కరీంనగర్ లీగల్: కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం తుపాకీ కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కోర్టు ఎస్కార్ట్ కానిస్టేబుల్ మహేష్ విధి నిర్వహణలో భాగంగా కరీంనగర్ జిల్లా కోర్టుకు హాజరయ్యాడు. అప్పటికే విరేచనాలతో బాధ పడుతున్న ఆయన మధ్యాహ్నం సమయంలో అవసరాలు తీర్చుకోవడానికి కోర్టు ఆవరణలోని పబ్లిక్ టాయిలెట్స్‌కు వెళ్లాడు.
అక్కడ ఉన్న కిటికీపై తన సర్వీస్ తుపాకీని ఉంచాడు. అదే సమయంలో కోర్టు హాలు నుంచి పిలుపురావడంతో తుపాకీ తీసుకోవడం మరిచిపోయాడు. అదే సమయంలో టాయిలెట్‌కు వెళ్లిన టైపిస్ట్ సిరాజ్ తుపాకీని గమనించి.. న్యాయవాది అశోక్‌కుమార్‌కు విషయం చెప్పగా.. ఆయన 100కు డయల్ చేశాడు. వెంటనే టూటౌన్ పోలీసుల ఆదేశాల మేరకు కోర్టు డ్యూటీలో కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీని స్వాధీనం చేసుకున్నాడు.