గల్ఫ్‌ బాధితుల పోరుబాట | Gulf victims fight | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ బాధితుల పోరుబాట

Nov 11 2017 9:35 AM | Updated on Aug 21 2018 3:10 PM

ప్రత్యేక తెలంగాణలో పెరిగిన గల్ఫ్‌ మృతుల సంఖ్య బాధిత కుటుంబాలకు అందని ఎక్స్‌గ్రేషియా ఆర్మూర్‌లో శనివారం పోరుబాటకు సన్నాహాలు ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక  ఆధ్వర్యంలో ఏర్పాట్లు

సొంతగడ్డపై ఉపాధి కరువై.. కోటి ఆశలతో గల్ఫ్‌బాట పట్టిన జిల్లావాసులెందరో విగతజీవులుగా ఇళ్లకు చేరుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి, సరైన పని దొరకక, అక్కడి ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలున్నాయి. మరికొందరు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా గల్ఫ్‌లో మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అప్పుల భారంతో మృతుని కుటుంబసభ్యులు సైతం ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాలకులు వీరి సమస్యల పరిష్కారంలో చిన్నచూపు చూస్తుండటంతో సుమారు పదేళ్లుగా ఈ ప్రాంతంలో గల్ఫ్‌ బాధితుల ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఆర్మూర్‌ పట్టణంలో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల గల్ఫ్‌ బాధితులు పోరుబాటను నిర్వహించనున్నారు.  

ఆర్మూర్‌: ఉపాధి వేటలో ఎందరో మంది తెలంగాణ ప్రాంత యువత గల్ఫ్‌ బాట పడుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్‌ చెప్పిన పని లేకపోవడం, పనిచేసే చోట ఒత్తిడి తట్టుకోలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విగతజీవులుగా ఇళ్లకు చేరుతున్నారు. ఇలా గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవకపోవడంతో గల్ఫ్‌ వెళ్లడానికి చేసిన అప్పుల భారంతో మృతుడి కుటుంబసభ్యులు కూడా తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  

లక్షల్లో యువత గల్ఫ్‌బాట.. 
నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, మెదక్‌ చుట్టపక్కల జిల్లాల నుంచి లక్షల మంది యువత గల్ఫ్‌ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీ అరేబియా, యూ ఏఈ, ఇరాక్‌తో పాటు ఇరాన్‌ దేశాల్లో కూలీలుగా పని చేయడానికి వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇలా గల్ఫ్‌బాట పట్టిన వారి సంఖ్య సుమారు పదిలక్ష ల వరకు ఉండగా, అందులో నిజామాబాద్, కామా రెడ్డి జిల్లాల నుంచే సుమారు రెండులక్షల మంది ఉం టారు. గల్ఫ్‌కు వెళ్లి వచ్చినవారు, ఏజెంట్ల మోసాలకు బలైనవారు మరో పదిలక్షల మంది వరకు ఉంటారు.  

గల్ఫ్‌ బాధితుల డిమాండ్లు.. 
గల్ఫ్‌ మైగ్రేట్స్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ. 2వేల కోట్లు కేటాయించాలి. దాని ద్వారా ఇతర దేశాలకు వెళ్లి నష్టపోయిన వారికి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి స్వయం ఉపాధిలో ప్రోత్సహిచాలి. 

విదేశాల్లో ఉన్న వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఏటా రూ. 500 కోట్లు కేటాయించాలి. 

గల్ఫ్‌తో పాటు విదేశాల్లో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలి. 
గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ఇండియన్‌ ఎంబసీలో తెలుగు అధికారిని నియమించాలి. 
గల్ఫ్‌లో ఉన్న వారికి, వారి కుటంబసభ్యులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి. 
నకిలీ ఏజెంట్ల వ్యవస్థను రూపుమాపి మోసపోయిన వారికి డబ్బులు తిరిగి ఇప్పించాలి. 
సెక్రెటేరియట్‌లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కార్యాలయాన్ని అందరికీ అందుబాటులో బయటకు తరలించాలి. 
ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి.

ప్రత్యేక రాష్ట్రంలో మృతుల సంఖ్య 431
2014 జూన్‌ 2 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి నేటివరకు అధికారిక లెక్కల ప్రకారం గల్ఫ్‌లో 431 మంది అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, పని చేసే చోట ప్రమాదాలు, ఆత్మహత్యలు.. తదితర కారణాలతో మృత్యువాత పడ్డారు. వీరి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోవడం సమస్యగానే మారింది. అయితే సమైక్య రాష్ట్రంలో గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లించేవారు. గత ఎన్నికల సమయంలో ఈ ఎక్స్‌గ్రేషియాను రూ. ఐదులక్షల కు పెంచాలని ఉద్యమాల్లో డిమాండ్‌ చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూపాయి కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోవడంతో గల్ఫ్‌ బాధితులు ఆందోళన బాట పడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement