మన ప్రాణ బంధువు చెట్టుతో చుట్టరికమేమైంది?

Green Belt Decreasing In Hyderabad City - Sakshi

గ్రేటర్‌లో తగ్గిపోతున్న గ్రీన్‌బెల్ట్‌

30 % జీహెచ్‌ఎంసీలో ఉండాల్సిన గ్రీన్‌బెల్ట్‌

8 % ప్రస్తుతం  రాజధానిలో ఉన్న గ్రీన్‌బెల్ట్‌

మెట్రో నగరాలతో పోలిస్తే హరితంలో గ్రేటర్‌ స్థానం

చెట్లతో మనిషి పెనువేసుకున్న అనుబంధాలెన్నో... పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు దానితో మమేకమయ్యే ఉంటాడు. ఒకప్పుడు చెట్టుతో ఆడుకునే కోతికొమ్మచ్చి లాంటి ఆటలెన్నో ఉండేవి. దాని కింద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు చాలా మంది. కాలం మారింది. చెట్టును మరిచి కాంక్రీట్‌ జంగిల్‌లో మనిషి ఒంటరిగా మిగిలాడు. నేడు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం సందర్భంగా సిటీ పరిస్థితి ఇదీ..

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరం.. ఒకప్పుడు తోటల నగరంగా ఎంతో ప్రసిద్ధి. భాగ్‌ అంటేనే తోటల నగరం అని అర్థం. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేసేది. నగరమంతా పచ్చని దుప్పటి కప్పుకున్నట్లు కళకళలాడేది. అహ్లాదానికి అడ్డాగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తి మారింది. ఎక్కడ చూసినా కాంక్రీట్‌ జంగిల్‌లా దర్శనమిస్తోంది. నగరానికి ఊపిరాడకుండా తయారయింది. గ్రేటర్‌లో పెరుగుతున్న వేడిమికి... వర్షపాతలేమికి నగరంలో గ్రీన్‌బెల్ట్‌ గణనీయంగా తగ్గడమే కారణమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానగరంలో గ్రీన్‌బెల్ట్‌ను పెంచేందుకు ప్రభుత్వం ‘హరిత’సంకల్పాన్ని చేపట్టింది. ఇళ్లలో పెంచుకునే మొక్కలతో గ్రీన్‌టాప్‌ పెరగదని, రావి, మద్ది, వేప, చింత వంటి మహావృక్షాలను మహోద్యమంగా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం సందర్భంగా మహానగరంలో హరిత వాతావరణంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం... 

హరిత సంకల్పం.. 
శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్‌)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం తగ్గుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన నగర పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో ‘హరిత’సంకల్పం చేపట్టింది. అయితే ఇది ఇంకా ఆశించిన ఫలితం రాలేదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. హరితహారంలో గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి లాంటి మొక్కలను పంపిణీ చేశారని... ఆక్సీజన్‌ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతమే నాటినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

పంచుతున్నవి ఇవి.... 
తులసీ, ఆశ్వగంధ, అల్లోవేరా, కలబంద, లెమన్‌ గ్రాస్, లావెండర్, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, వేప, కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, నందివర్ధనం, జాస్మిస్, మంచారం, ఇతర పూల మొక్కలు. 

పంచాల్సినవి ఇవి... 
రావి, మద్ది, మర్రి, చింత వంటి మహా వృక్షాలుగా ఎదిగే మొక్కలు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top