గ్రేటర్‌దే సింహభాగం

Greater Hyderabad Top in Tax Collections - Sakshi

రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయంలో గ్రేటర్‌ వాటా 80 శాతం  

వృద్ధిరేటులో పంజగుట్ట టాప్‌

ఉద్యోగుల సమష్టి కృషి పోటాపోటీగా వసూళ్లు

సాక్షి సిటీబ్యూరో: ఉన్నతాధికారులు, సిబ్బంది సమష్టి కృషితో  వాణిజ్య పన్నుల శాఖ ద్వారా  రాష్ట్ర ఖజానాకు ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. వాణిజ్య పన్ను ల శాఖ ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా, రాష్ట్ర ఆదాయంలో గ్రేటర్‌ తొలివరుసలో ఉంది.  2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను వాణిజ్య పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.46 వేల కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో  గ్రేటర్‌ పరిధిలోని ఏడు డివిజన్ల నుంచే దాదాపు 80–85 శాతం ఆదాయం సమకూరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 11 డివిజన్లు ఉండగా గ్రేటర్‌ పరిధిలోని ఏడు డివిజన్లలో రికార్డు స్థాయిలో వసూళ్లు జరిగాయి. ఈ ఏడాది మార్చి నెల  వృద్ధి రేటులో పంజాగుట్ట డివిజన్‌ మొదటి స్థానం సాధించగా, బేగంపేట్‌ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ రూరల్, సికింద్రాబాద్, ఆబిడ్స్, సరూర్‌నగర్, చార్మినార్‌ డివిజన్లు సైతం టాక్స్‌ వసూళ్లలో తమవంతు పాత్ర పోషించాయి. కేంద్ర కార్యాలయం నిర్ధేశించిన టార్గెట్‌ను పూర్తి చేయడంలో అన్ని డివిజన్లకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో సమష్టిగా కృషి చేయడంతో రికార్డు స్థాయిలో పన్నులు వసూలయ్యాయయి. దీంతో బుధవారం ఆయా డివిజన్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు.  

ఆరోగ్యకరమైన పోటీ...  
వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పన్నుల వసూలుకు ప్రత్యేక యాప్‌లు రూపొందించడమేగాక అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు టార్గెట్లు విధిస్తూ ప్రోత్సహించడంతో నగరంలోని డివిజన్ల ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. దీంతో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి డీసీటీఓ వరకు అన్ని స్థాయిల అధికారులు సమష్టిగా కృషి చేశారు. పన్నుల వసూలుకు సంబంధించిన డీలర్ల జాబితాలను రోజువారి యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయడం లో సిబ్బంది ఉత్సాహంగా పని చేశారు. క్యాడర్‌తో సంబంధం లేకుండా అందరూ తమ వంతు పాత్ర పోషించడంతో పన్ను వసూళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.  

గ్రేటర్‌ వాటా 80 శాతం...  
ఎక్సైజ్, పెట్రోలియం, పొగాకు  ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో 45 శాతం ఆదాయం వీటితో వస్తుంది. గ్రేటర్‌ పరిధిలోనే మూడు ఉత్పత్తుల కేంద్ర కార్యాలయాలు  ఉండడంతో ఆదాయం ఎక్కువగా వస్తోంది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే  అన్ని రకాల ఉత్పత్తుల ప్రధాన కార్యాలయాలు నగరంలోనే ఉండటం, దిగుమతులు, హోల్‌సెల్‌ వ్యాపారాలు,  భవన నిర్మాణ రంగానికి సంబందించిన వ్యాపార లావాదేవీలు ఇక్కడే ఎక్కువ జరుగుతున్నందున వాణిజ్య పన్నుల వసూలులో గ్రేటర్‌ వాటా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలోని మిగితా నాలుగు డివిజన్లలో వ్యాపారలావాదేవీలు లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం.  

సమష్టిగా సాధించారు..
ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ ఆదేశాలకు అనుగుణంగా ట్యాక్స్‌ వసూళ్లలో సిబ్బంది, అధికారులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించారు. యాప్‌ల రూపకల్పనతో పన్నుల వసూలు సులభతరమైంది. డివిజన్‌లో రోజువారి  సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు టార్గెట్‌లను పూర్తి చేశాం.  అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో డివిజన్‌ వృద్ధి రేటులో అగ్రస్థానంలో నిలిచింది.
–కే. హరిత, పంజగుట్ట జాయింట్‌కమిషనర్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top