కూటమిలో  కుప్పిగంతులు !

Great Alliance Candidates Problems Warangal - Sakshi

టీడీపీ మార్క్‌ రాజకీయం 

భాగస్వాములకు సహకరించకుండా కార్యకర్తల కట్టడి 

నర్సంపేట, పరకాల శ్రేణులకు దిశానిర్దేశం

‘పశ్చిమ’లో పరిస్థితి చేతికందితేనే సహకారం అని తేటతెల్లం 

సాక్షి , వరంగల్‌: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి..  స్వయం ప్రతిపత్తి సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడడానికి మహా కూటమిగా జట్టు కట్టాం.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రాజకీయ వైరాన్ని మరిచిపోయి కలిసికట్టుగా పని చేసి  టీఆర్‌ఎస్‌ను ఓడించాలి..’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి పత్రికా సమావేశాల్లో పిలుపునిస్తున్నారు. అదే.. సొంత నియోజకవర్గం నర్సంపేట, తన ప్రాబల్యం ఉన్న పరకాల నియోజకవర్గాల్లో మాత్రం  కూటమి లేదు, గీటమి లేదంటున్నారు. తన ఆధీనంలో ఉన్న టీడీపీ శ్రేణులను కూటమికి దూరం పెడుతున్నారు. పొత్తులపై ఇంకా పూర్తి స్థాయిలో ఏ విషయమై తేలక ముందే కాంగ్రెస్‌కు ఎలా సహకరిస్తామంటూ టీడీపీ కార్యకర్తలను కట్టడి చేస్తుండడం కూటమిలోని పార్టీల శ్రేణులకు అంతుపట్టడం లేదు.  రేవూరి ప్రకాష్‌రెడ్డి నర్సంపేట నుంచి టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాబీయింగ్‌ ద్వారా చివరి నిమిషం వరకు యత్నించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి  సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి ఉండడం.. పైగా ఆయన  ‘హస్తం’ గుర్తుతో కాకుండా సొంత శక్తిపై గెలిచి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో దొంతి మాధవరెడ్డికి ఇక్కడ టికెట్‌ ఇవ్వకుండా ఉండలేని అనివార్య పరిస్థితి ఏర్పడింది.  రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసమే వరంగల్‌ పశ్చిమ టికెట్‌ను టీడీపీ తరఫున ఆయనకు కేటాయించారు. కానీ పశ్చిమ నియోజకవర్గంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. 15 ఏళ్లుగా పార్టీలో ఉంటూ తనకంటూ బలమైన పునాదులు వేసుకున్నారు. బలమైన కేడర్‌ను తయారు చేసుకున్నారు. టికెట్‌ను పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించటంతో ఆగ్రహించిన ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. 

కూటమి  లక్ష్యంపై నీలినీడలు
పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో బలమైన వర్గంగా నాయిని రాజేందర్‌రెడ్డి  సహకరించే పరిస్థితి లేకపోవడంతో రేవూరి తనకు ప్రాబల్యం ఉన్న నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్‌ను కాంగ్రెస్‌కు సహకరించొద్దని ఆదేశాలు చేశారు. నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకుంటేనే తమ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌కు సహకరిస్తారని.. లేకుంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకాష్‌రెడ్డి బాహటంగానే చెబుతుం డడంపై మహాకూటమి  లక్ష్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top