
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇంతకాలం లోక్‌సభ బరిలో దిగాలనే వ్యూహాలకు పదునుపెట్టిన నేతలు ఇప్పుడు శాసనసభపై గురిపెట్టారు. పార్లమెంటు ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉండడంతో ‘ముందస్తు’ ఆలోచనను అధినాయకత్వం ముందుంచారు. అసలు ఇలా మనసు మార్చుకోవడానికి కారణం తెలంగాణకు జమిలీ ఎన్నికలు జరగకపోవడమే. ఎమ్మెల్యేగా జాతకాన్ని పరీక్షించుకొని అంతగా అయితే లోక్‌సభ సీటుకు పాగా వేయవచ్చని భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీచేసి పరాభవం పాలైన ఇద్దరు యువనేతలు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడమే మంచిదనే అభిప్రాయానికొచ్చారు. దానికి అనుగుణంగా రణక్షేత్రంలోకి దిగారు.
అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు
2014 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి(కాంగ్రెస్), తూళ్ల వీరేందర్‌గౌడ్(టీడీపీ) ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికల్లో వీరిరువురు టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వాస్తవానికి వీరేందర్‌గౌడ్ మొదట్నుంచి అసెంబ్లీ బరిలో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు.
2014లో ఉప్పల్ సీటును ఆశించినప్పటికీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాల్సిరావడంతో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగాల్సివచ్చింది. ఈ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణలు మారినా ఆయన మాత్రం టీడీపీనే నమ్ముకున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్ నుంచి రంగంలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌తో పొత్తు కుదరడం.. ఈ సీటును టీడీపీకి సర్దుబాటు చేస్తుండడంతో వీరేందర్‌కు కలిసివస్తోంది.
మరోవైపు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. అయితే, టీడీపీ పొత్తు ఆయన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆపార్టీ ప్రతిపాదించిన సీట్లలో రాజేంద్రనగర్ కూడా ఉండడం ఆయన ఒకింత కలవరానికి గురిచేస్తోంది.
మల్లారెడ్డి సైతం..
మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా ఈ సారి శాసనసభ వైపు మొగ్గుచూపుతున్నారు. మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేయకపోవడంతో ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు టీఆర్‌ఎస్ అధిష్టానం కూడా సంకేతాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా కంటోన్మెంట్ నుంచి పోటీకి సై అంటున్నారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని చేవెళ్ల బరిలో నిలపాలని పీసీసీ భావించింది. ఈ అంశంపై ఆయనతో సంప్రదింపులు కూడా జరిపింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎంపీగా పోటీచేయాలని కేఎల్లార్ కూడా భావించారు.
అనూహ్యంగా శాసనసభకు ముందస్తు రావడంతో ఆయన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఇదే సీటుపై కన్నేసిన జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా పోటీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడు నెలల క్రితం రాహుల్‌గాంధీ జిల్లా పర్యటనలో తన మార్కును ప్రదర్శించారు. కుటుంబానికి ఒకే సీటు షరతుతో కార్తీక్‌రెడ్డికి టికెట్ నిరాకరిస్తే బరిలో దిగడానికి కర్చీఫ్ వేశారు. ఇలా ఎవరికి వారు శాసనసభ కదనరంగానికి సై అంటున్నారు..