ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

Grain Purchase Centers Start Minister Harish Rao - Sakshi

నల్లగొండ : జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని చోట రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని  కలెక్టర్లను, జేసీలను రాష్ట్రభారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిం చారు.  నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేటలకు 6లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో దిగుబడి ఎక్కువగా వచ్చిందన్నారు. పండిన పంట మార్కెట్‌కు పెద్ద ఎత్తున వస్తున్నందున రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. 17శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ప్రభుత్వం కొనుగోలు సంస్థలు కొనకపోవడంతో ప్రైవేట్‌ వారిని ఆశ్రయించే పరిస్థితి ఉందన్నారు.

రెండు రోజులుగా సూర్యాపేటలో మద్దతు ధర లభించడం లేదని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితులను మంత్రి గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందు కు జిల్లా యంత్రాంగానికి పూర్తిస్వేచ్ఛను ఇచ్చామని, అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలు ఎదురైతే జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ టాస్క్‌ ఫోర్స్‌ను సంప్రదించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంటనే పంపించాలన్నారు.

తూకం వేసిన ధాన్యం రెండు రోజుల తరువాత మిల్లులకు పంపిస్తే వ్యత్యాసం వచ్చి రైతులకు ధర తగ్గించే సమస్య ఎదురవుతుందన్నారు. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ జిల్లాలో 1లక్ష 85వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.  జిల్లాలో 130 కోట్ల మేర రైతులకు ధాన్యం చెల్లింపులు చేశామన్నారు. జిల్లాకు 25లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి అంజయ్య, పౌర సరఫరాల శాఖ అధికారి ఉదయ్‌కుమార్‌ జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసవర్మ, జిల్లా వ్యవసాయశాధికారి నర్సింహరావు, మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు అలీం తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top