పేదింటి కుసుమాలు.. కాబోయే డాక్టర్లు 

Gowlidoddi Gurukulam Students Got Good Ranks In Neet 2018 - Sakshi

నీట్‌లో సత్తాచాటిన గౌలిదొడ్డి గురుకుల విద్యార్థులు 

11 మందికి ఎంబీబీఎస్‌.. ఇద్దరికి బీడీఎస్‌ సీట్లు 

రాయదుర్గం : వారంతా పేదింటి పిల్లలు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, గురుకుల విద్యా సంస్థల తోడ్పాటుతో కాబోయే డాక్టర్లుగా మారబోతున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతులు, నిత్యకూలీల పిల్లలలో 13 మంది డాక్టర్లు అయ్యే అవకాశం రావడం విశేషం. నీట్‌లో గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ /మెడికల్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం  54 మంది విద్యార్థులు నీట్‌ çపరీక్ష రాయగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు, మరో ఇద్దరు విద్యార్థులకు బీడీఎస్‌ సీట్లు రావడం ఖాయంగా మారింది. 13 మంది విద్యార్థులు పది వేల లోపు ర్యాంకులు సాధించారు.

కళాశాల నుంచి ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులుగా అఖిల భారత స్థాయి ఎస్టీ కేటగిరిలో రాజు (2,876), అనూష (2,900), ఎస్సీ కేటగిరిలో రాము (3519 ర్యాంకు), కార్తీక్‌ (4452), మాధవి (4,982), అన్వేష్‌ (5,737), ఆర్‌.శ్వేత (6,213), అభిలాష్‌ (7,091), నవ్యశ్రీ (7860), సాయితేజ (9480), సంధ్య(9707) ర్యాంకులను సాధించడం విశేషం. వీరందరికీ ఎంబీబీఎస్‌ సీట్లు రావడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. పది వేలకుపైగా ర్యాంకులు సాధించిన రాధిక (10,471), లావణ్య (10,751) బీడీఎస్‌ సీట్లు రావడం ఖాయమని వారు తెలిపారు. 
30 మందికి టాప్‌–5 కళాశాలల్లో 

ఇంజనీరింగ్‌ సీట్లు ఖాయం 
నగరంలోని టాప్‌–5 కళాశాలల్లో 30 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్‌ సీట్లు కచ్చితంగా వస్తాయని గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ/మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వివేకానంద అన్నారు. మరో 20 మంది విద్యార్థులకు ఏజీ బీఎస్సీలో కూడా సీట్లు వస్తాయన్నారు. నీట్‌లో సత్తా చాటిన విద్యార్థులలో 11 మంది ఎంబీబీఎస్‌ సీట్లు, ఇద్దరికి బీడీఎస్‌ సీట్లు ఖాయంగా వస్తాయని చెప్పారు. గత ఏడాది 8 మందికి మాత్రమే ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చాయని, ప్రస్తుత ఏడాది పెరగడం ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టి కృషి ఫలితమన్నారు. కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఉన్నతాధికారుల ప్రోత్సాహం తోనే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top