ఆహార కల్తీపై ‘నియంత్రణ’ ఏదీ..? | Govt warns for Food adulteration | Sakshi
Sakshi News home page

ఆహార కల్తీపై ‘నియంత్రణ’ ఏదీ..?

Jul 25 2017 1:57 AM | Updated on Sep 5 2017 4:47 PM

కల్తీలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.

ఆహార నియంత్రణ శాఖను పట్టించుకోని ప్రభుత్వం
► రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది 20 మంది ఉద్యోగులే

సాక్షి, హైదరాబాద్‌: కల్తీలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఆహార కల్తీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తోంది. ఎలాంటి కల్తీలు జరిగినా బాధ్యులపై పీడీ చట్టం ప్రయోగించాలని చెబుతోంది. అయితే ఆహార నాణ్యతను పర్యవేక్షించే ఆహార నియంత్రణ శాఖను మాత్రం పట్టించుకోవడంలేదు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండే ఆహార నియంత్రణ విభాగాన్ని అరకొర సిబ్బంది సమస్య వేధిస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆహార నమూనాలను వెంటనే సేకరించే పరిస్థితి ఎక్కడా లేదు. కనీసం జిల్లాకు ఒక్క అధికారి కూడా లేని పరిస్థితి. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాల ప్రకారం నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఆహార నియంత్రణ అధికారి ఉండాలి.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక ఆహార నియత్రణ అధికారి ఉండాలి. అయితే మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. ఆహార నియంత్రణ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పని చేస్తున్నారు. మిగిలిన 17 మంది జిల్లాల్లో ఉన్నారు. ఈ లెక్కన ఆహార నియంత్రణ విభాగం లేని జిల్లాలో 13 ఉన్నాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాల ప్రకారం కాకున్నా.. నగరపాలక సంస్థలు మినహా ప్రతి జిల్లాలో కనీసం ముగ్గురు చొప్పున అధికారుల ఉండాల్సిన అవసరం ఉంది.

నమూనాలు ఎట్లా..
నీరు, ఔషధాలు, మద్యం.. మినహా మనుషులు తీసుకునే ప్రతి ఆహార పదార్థం నాణ్యత పర్యవేక్షణ బాధ్యత ఆహార నియంత్రణ విభాగం పరిధిలోనే ఉంటుంది. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇప్పుడు ఆహార ఉత్పత్తుల తయారీ విపరీతంగా పెరిగింది. అయితే నాణ్యత విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే నమూనాలను సేకరించే పరిస్థితి లేదు.

ఆహార నియంత్రణ అధికారి ఒక్కరే ఉన్న జిల్లాలు
వరంగల్‌ అర్బన్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, వికారా బాద్, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజా మాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement