తింటే.. కడుపు మంటే | Food adulteration has become rampant in Sathya Sai District | Sakshi
Sakshi News home page

తింటే.. కడుపు మంటే

Jul 20 2025 6:02 AM | Updated on Jul 20 2025 6:02 AM

Food adulteration has become rampant in Sathya Sai District

విచ్చలవిడిగా ఆహారం కల్తీ

బయట దొరకని నాణ్యమైన ఆహార

అపరిశుభ్ర వాతావరణంలో వంటల తయారీ

రంగు, రుచి కోసం ప్రమాదకర రసాయనాల వాడకం

హోటల్‌ ఆహారంతో చుట్టుముడుతున్న కొత్త రోగాలు

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నామమాత్రపు తనిఖీలు

లాభాపేక్షలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు

సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి నల్లమాడ వెళ్లే దారిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంటులో నలుగురు స్నేహితులు వెళ్లి పార్టీ చేసుకున్నారు. తినేందుకు ఆర్డర్‌ ఇవ్వగా.. చికెన్‌ ముక్కలపై విపరీతమైన ఎరుపు రంగు ఉంది. రుచి తేడాగా ఉండటంతో నిర్వాహకులను ప్రశ్నిస్తే.. కొత్తగా ఏర్పాటు చేశామని.. నిబంధనల గు­రించి తెలియదని చెప్పా­రు. రుచి కోసం మాస్టర్‌ ఏం చేస్తున్నాడో సరిగా తెలియదని సమా­ధానం ఇవ్వడంతో కస్టమర్లు అవాక్కయ్యారు.

ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కొద్దిగా ముందుకెళ్లిన తర్వాత బ్రిడ్జి పక్కన ఓ ఇంట్లో మెస్‌ ఏర్పాటు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే వండుతూ వడ్డిస్తున్నారు. గత్యంతరం లేని ప్రజలు బస్టాండుకు సమీపంలో ఉంటుందని అక్కడే తిని వెళ్తుంటారు. అపరిశుభ్రత గురించి నిర్వాహకులను అడిగితే... ‘తింటే తినండి.. లేదంటే లేదు’ అని చెబుతున్నారు.

సాక్షి, పుట్టపర్తి: జీవన శైలిలో వచ్చిన మార్పులతో ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. ప్రస్తుతం ఉరుకుల పరుగులు జీవితంలో చాలా మంది ఇంటి భోజనం కంటే హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్‌కు ఓకే చెబుతున్నారు. ఇక వారంతాల్లో చాలామంది కుటుంబాలతో సహా బయటకు వెళ్లి బిర్యానీలు, స్పైసీ ఫుడ్‌ తినేందుకు ఇష్టపడుతున్నారు. కానీ హోటళ్ల నిర్వాహకులు మాత్రం డబ్బులు తీసుని ఆహారం పేరుతో అనారోగ్యాన్ని వడ్డిస్తున్నారు. నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసిన వంటకాలు వడ్డిస్తూ జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు.

పెరిగిన పార్టీ కల్చర్‌..
పాతికేళ్ల క్రితం వరకు ఎక్కడికైనా వెళ్లినా భోజనం సమయానికి ఇంటికి వచ్చేవారు. రాలేని పరిస్థితులు ఉన్నపుడే మాత్రమే హోటళ్లలో తినేవారు. కొందరు ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. బయటి ఆహారాన్ని తీసుకునేవారు కాదు. సంపాదనలో తక్కువ ఖర్చు చేసి, ఎక్కువ దాచుకునేవారు. కానీ ఇప్పుడు ‘కల్చర్‌’ మారింది. ‘సోషియల్‌ బిహేవియర్‌’లో తేడా వచ్చింది. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోకి ‘పార్టీ కల్చర్‌’ చొచ్చుకువచ్చేసింది. బర్త్‌డే, మ్యారేజ్‌డే, ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌.. సందర్భం ఏదైనా ‘పార్టీలు’ ఇస్తున్నారు.

ఇంటి భోజనం కంటే రెస్టారెంట్లలోని ఆహారం తినడానికే మొగ్గు చూపుతున్నారు. నలుగురు స్నేహితులు కలిస్తే డిన్నర్‌ బయట చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో ఉన్నారు కానీ, ఆరోగ్యకర, పోషకాహారాన్ని తింటున్నామా? లేదా? అనేది గ్రహించలేకపోతున్నారు. పైగా ఏ కల్తీ ఆహారమో కూడా కనిపెట్టలేక...హోటల్‌ యజమాని పెట్టింది తింటున్నారు.

నిబంధనలు తూచ్‌..
జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, దాభాలు, చాట్, నూడుల్స్‌ షాపులు అన్ని కలుపుకుని 4 వేలకుపైగా ఉంటాయి. వీటి ద్వారా ఏటా రూ. కోట్ల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటళ్లు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంది. ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరు వివిధ హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు కనీసం 12 శాంపిల్స్‌ సేకరించాలన్నది నిబంధన.

వీరు సేకరించిన శ్యాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత కేసులు నమోదు కూడా వీరి బాధ్యతే. ఆహారం కల్తీ జరిగినట్లు తేలితే క్రిమినల్‌ లేదా సివిల్‌ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ జిల్లాలో ఇవేమీ జరగడం లేదు. దీన్ని ఆసరగా చేసుకున్న వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.

అనుమతి లేని వ్యాపారాలు..
హోటల్‌ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. పరిశుభ్రత విషయంలో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు దరఖాస్తు చేయాలి. నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాలి. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి 25 శాతానికి మించి ఉండవనేది బహిరంగ రహస్యం. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి పట్టించుకోవడం లేదు.

నాసిరకం ఆహార పదార్థాలు వాడటం, రోజుల తరబడి ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన వాటిని వేడి చేసి విక్రయిస్తున్నారు. ఆహారం వండే ప్రాంతాలూ తీవ్ర అపరిశుభ్రంగా ఉన్నా.... పట్టించుకునే నాథుడు లేడు. పట్టణాల్లో అధిక శాతం మురుగుకాల్వలు, చెత్తకుప్పల పక్కన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు దర్శనమిస్తున్నా పర్యవేక్షణ కరువైంది.

నామమాత్రంగా తనిఖీలు..
జిల్లాలో ఏడాదికి 360 శ్యాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపించాల్సి ఉంది. అయితే అధికారులు జిల్లాలో నెలకు 12 శాంపిల్స్‌ మాత్రమే తీసి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఇందులో ఒక్కో నెల కేవలం రెండు, మూడు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. సీజన్‌ను బట్టి పండ్ల దుకాణాలపైనా నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. కల్తీ జరిగిన, రంగులు కలిపిన ఆహార పదార్థాలకు నాన్‌ స్టాండర్డ్‌ పేరిట ల్యాబ్‌ నుంచి రిపోర్ట్‌ వస్తే వారికి నామమాత్రపు జరిమానా వేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఫుడ్‌సేఫ్టీ అధికారులు మేల్కొని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

ఆహార కల్తీ ఇలా..
చిక్కదనం కోసం పాలల్లో నాసిరకం పాలపౌడర్లు, యూరియా, పిండి, నూనె కలిపి విక్రయిస్తున్నారు. అలాగే పరిమాణం పెంచేందుకు బోరు నీటిని కలుపుతారు.

 పశువుల ఎముకలను బట్టీల్లో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీసి వంటనూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీనివల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

 ఆకర్షణీయంగా ఉండేందుకు చికెన్, మటన్‌ బిర్యానీలు, తందూరి చికెన్‌లో ఎక్కువగా హానికరమైన రంగులను కలుపుతున్నారు. ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతో పాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి బిర్యానీలో కలిపి విక్రయిస్తున్నారు.

 కారం ఎర్రగా ఉండేందుకు మిరపకాయల్లో సూడాన్‌ రంగులు కలుపుతున్నారు. పసుపులో మెటానిల్‌ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతున్నారు. వీటిని వంటలో వినియోగిస్తే కేన్సర్‌ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

 ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ కాచి ఆహార పదార్థాలు వండుతున్నారు. దీనివల్ల కేన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాదమున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

తనిఖీలు చేస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా ఆహార తనిఖీలు చేస్తూనే ఉన్నాం. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. ఆహారం కల్తీ అవుతోందని ఎవరైనా ఫిర్యాదు చేసినా... అక్కడకు వెళ్లి నమూనాలు సేకరిస్తున్నాం. ఆహారం కల్తీ జరగకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వ్యాపారులను పిలిచి హెచ్చరిస్తున్నాం. రామచంద్ర, ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement