అందరికీ యూనిఫాం

Govt School Uniforms Implications Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై స్కూల్‌ యూనిఫాం 9, 10వ తరగతి విద్యార్థులకు సైతం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే యూనిఫాం అందేది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో మిగతా రెండు తరగతుల విద్యార్థులకు సైతం యూనిఫాం అందించనున్నారు. ఈ మేరకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకుగానూ అయ్యే కుట్టుకూలిని సైతం విడుదల చేసింది. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఒకేరకమైన యూనిఫాం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందజేస్తోంది. గత కొన్నాళ్లుగా 1వ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే వీటిని అందించేవారు. రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా సరఫరా చేస్తున్న వీటిని ఈ విద్యా సంవత్సరం నుంచే 9, 10వ తరగతులు చదివే విద్యార్థులకు కూడా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులందరికీ మేలు జరగనుంది. 

జిల్లాలో..
ఆదిలాబాద్‌ జిల్లాలో 450 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు(డీఈవో పరిధిలో) ఉన్నా యి. వీటితో పాటు 17 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న వారంతా పేద విద్యార్థులే. ఈ పాఠశాలల్లో చదువుకుంటున్న 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేసేవారు. అయితే కేజీబీవీల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థినిలకు మాత్రమే ఏకరూప దుస్తులు అందిస్తున్నారు. 13 కేజీబీవీల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు 527 మంది, 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు 534 మంది ఉన్నారు. ప్రభుత్వ, జెడ్పీహెచ్‌ఎస్‌లలో 9, 10వ తరగతులు చదివే బాలికలు 4910, బాలురు 5182 మంది, మొత్తం 10092 మంది ఉన్నారు. అలాగే ఆరు ఆదర్శ పాఠశాలల్లో 277 బాలురు, 467 మంది బాలికలు ఉన్నారు. వీరికి త్వరలోనే బట్ట రాగానే ఎమ్మార్సీల తీర్మానం అనంతరం యూనిఫాం కుట్టి అందజేయనున్నారు.
 
కుట్టుకూలి విడుదల..ప్రభుత్వ యాజమాన్య          
పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. కుట్టుకూలీకి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రతీ విద్యార్థికి రెండు జతల చొప్పున దుస్తులు అందజేయనున్నారు. అయితే ఒక జతకు రూ.100 చొప్పున దర్జీకి చెల్లించనున్నారు. 1061 మంది కేజీబీవీ విద్యార్థినిలకు సంబంధించి రూ.53,050, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు 694 మందికి గానూ రూ.69,400, ప్రభుత్వ, జెడ్పీహెచ్‌ఎస్‌  విద్యార్థులు 10,092 మందికి గానూ రూ.1,09,200ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ఎస్‌ఎంసీ ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వ నిర్ణయం మంచిదే
9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలన్న ప్రభుత్వ  నిర్ణయం మంచిదే. ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు యూనిఫాం కుట్టిస్తుండడంతో వారికి ఆర్థికంగా కొంత భారమయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వమే రెండు జతల యూనిఫాం  ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.  – దానిష్, 10వ తరగతి విద్యార్థి 

ఆనందంగా ఉంది..
మాకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే యూనిఫాం ఉచితంగా అందించారు. 9వ తరగతిలో ఇవ్వలేదు. ఈఏడాది నుంచి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు యూనిఫాం ఇస్తున్న విషయం తెలిసింది. చాలా ఆనందంగా ఉంది.– నిఖిత, 10వ తరగతి విద్యార్థిని 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top