3 కోట్ల మందికైనా బియ్యం ఇస్తాం | Govt not hell-bent on scrapping ration cards: Etela Rajender | Sakshi
Sakshi News home page

3 కోట్ల మందికైనా బియ్యం ఇస్తాం

Mar 21 2017 2:29 AM | Updated on Sep 5 2017 6:36 AM

3 కోట్ల మందికైనా బియ్యం ఇస్తాం

3 కోట్ల మందికైనా బియ్యం ఇస్తాం

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూపాయికే కిలో బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని..

ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనట్లు 2.75 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం
శాసనసభలో మంత్రి ఈటల
రాష్ట్రం కన్నా కేంద్రమే బియ్యం సబ్సిడీకి ఎక్కువ నిధులిస్తోందన్న కిషన్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూపాయికే కిలో బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైతే మూడు కోట్ల మందికైనా బియ్యం పంపిణీ చేస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా 2.75 కోట్ల మందికి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకం అమలుపై సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి, సభ్యులు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు.

బియ్యం సబ్సిడీ కింద కేంద్రం రూ.3,717 కోట్లు నిధులిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,665 కోట్లు అదనంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం కన్నా కేంద్రమే రూ.1,100 కోట్లు అధికంగా నిధులు ఇస్తోందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా పేదల కార్డులు తొలగిస్తోందని మండిపడ్డారు. దీంతో ఈటల స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా కార్డులు తొలగించబోమని, డూప్లికేషన్లు ఉంటేనే తొలగిస్తున్నామన్నారు.

ప్రశ్నల మాయంపై ఆగ్రహం
ప్రశ్నోత్తరాల్లో తన ప్రశ్నల సంఖ్యను కుదించ డంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ.. మరో ప్రశ్న సైతం అలాంటిదే ఉండడంతో దానిలో సిగ్నేటరీగా పెట్టామన్నారు. దీనిని కిషన్‌రెడ్డి వ్యతిరేకిం చారు. తాను సంతకమే చేయకుండా సిగ్నేటరీ ఎలా అవుతానని ప్రశ్నించారు. దీనికి ప్రతిపక్ష నేత జానారెడ్డి మద్దతు తెలిపారు. దీంతో మరోసారి ఇలా జరగకుండా చూస్తామని స్పీక ర్‌ హామీ ఇవ్వడంతో కిషన్‌రెడ్డి శాంతించారు.

పీహెచ్‌సీల బలోపేతం: లక్ష్మారెడ్డి
రాష్ట్రంలో పీహెచ్‌సీల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాష్ట్రంలోని 698 పీహెచ్‌సీల్లో 15,196 పోస్టులకుగాను 3,606 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఇందులో 2,118 పోస్టుల భర్తీ కోసం అనుమతించామన్నారు.

సభాసంఘం వేయండి: జీవన్‌రెడ్డి
సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల విషయంలో గ్రామాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని, దీనికి పరిష్కారాలు కనుగొనేందు కు సభా సంఘం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. దీనికి ఉప ముఖ్య మంత్రి మహమూద్‌ అలీ సమాధాన మిస్తూ.. గ్రామాల్లో పంచనామాల ఆధారంగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా యన్నారు. భూచట్టంలో మార్పులు, కొత్త చట్టానికి సంబంధించి నల్సార్‌ వర్సిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు.

పేద బ్రాహ్మణులకు అండగా ఉంటాం
బ్రాహ్మణుల సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు కేటాయించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు సతీశ్‌కుమార్‌ వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బ్రాహ్మణ సదనం ఏర్పాటు కోసం స్థల సేకరణ కూడా పూర్తి చేశామని.. పేద బ్రాహ్మణులకు సాయం అందించేందుకు కేవీ రమణాచారి నేతృత్వం లో కమిటీ వేశామని వెల్లడించారు.

ఈటలకు సభలో జన్మదిన శుభాకాంక్షలు
ఆర్థిక మంత్రి ఈటలకు శాసనసభ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. సోమవారం సభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే ఈటలకు స్పీకర్‌ మధుసూదనాచారి సభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిం చారు. దీనికి సభలోని సభ్యులంతా బల్లలు చరుస్తూ ఈటలకు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement