యాచకులారా.. పారాహుషార్‌!

Government decision on beggers in hyderabad

     హైదరాబాద్‌లో అడుక్కుంటూ కనిపిస్తే జైళ్ల శాఖ గృహాలకు తరలింపు 

     గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ నేపథ్యంలో సర్కారు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యాచకులను నిర్బంధించి జైళ్ల శాఖ పరిధిలోని ప్రత్యేక గృహాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చంచల్‌గూడ కేంద్ర కారాగారం వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్‌ హోంను పురుష యాచకుల కోసం, చర్లపల్లి కేంద్ర కారాగారం పక్కన ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం వర్క్‌ హౌస్‌ కమ్‌ స్పెషల్‌ హౌస్‌గా ఉపయోగించనుంది. ఏపీ యాచకుల నిర్మూలన చట్టం–1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇవాంకా ట్రంప్‌తో పాటు 1,500 మంది బిగ్‌షాట్స్‌.. 
వచ్చే నెల 28 నుంచి 30 వరకు హెచ్‌ఐఐసీలో జరగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా  ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీల కంటికి నగరంలోని యాచకులు కనిపించకుండా ఏరాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పురుష, మహిళా యాచకుల కోసం వేర్వేరుగా నిర్వహించే ఈ హోమ్‌ల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర జైళ్లశాఖకే అప్పగించింది. చంచల్‌గూడలోని స్టేట్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రిన్స్‌పాల్‌ను పురుష యాచకుల వర్క్‌హోంకు సూపరింటెండెంట్‌గా, చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ సూపరింటెండెంట్‌ను మహిళా యాచకుల వర్క్‌ హోంకు సూపరింటెండెంట్‌గా నియమించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top