
సాక్షి, సిటీబ్యూరో: ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమానికి విశేషస్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి చేయూత నందించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ కళ్యాణ్‌చక్రవర్తిలు హోటళ్ల యజమానులు, స్వచ్చందసంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి విజ్ఞప్తి చేయడంతో 40 వేల ఫుడ్‌ప్యాకెట్లు అందించేందుకు ఒక్కరోజులోనే వివిధ సంస్థలు, హోటళ్లు ముందుకొచ్చాయి. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్‌డే సందర్భంగా ఈ ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఇందులో భాగంగా 14వ తేదీన ఫుడ్ ప్యాకెట్లు అందించేందుకు కన్‌ఫిగరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), హోటల్స్ అసోసియేషన్, పిస్తా హౌస్, డీవీ మనోహర్ హోటళ్లతో పాటు పలు హోటళ్లు, వ్యక్తులు ముందుకొచ్చినట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని అందించాలనుకునేవారు దిగువ ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చునని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 95421 88884(రజనీకాంత్), 96668 63435(విశాల్), 98499 99018 (పవన్).