దోమ కాటుకు చేప దెబ్బ

GHMC Staff Releasing Fish in Lakes And Canals For Larvae - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డెంగీ, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ నివారణ చర్యలు చేపట్టింది. గణేశ్‌ నిమజ్జనాల కోసం నిర్మించిన కొలనుల్లో (బేబీ పాండ్స్‌) దోమల ఉత్పత్తికి కారణమయ్యే లార్వా నివారణకు 50వేలకు పైగా గంబూసియా చేపలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ 23 నిమజ్జన కొలనులను ప్రత్యేకంగా నిర్మించింది. ఇవి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారకుండా ఉండేందుకు వీటిల్లో లార్వాలను తినే గంబూసియా చేపల్ని ఎంటమాలజీ విభాగం వదులుతోంది. ప్రస్తుతం వదులుతున్న 50వేల గంబూసియా చేపలు నెల రోజుల్లోనే 5లక్షలకు పెరుగుతాయని, మిగతా చేపల్లా ఇవి గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలనే ఉత్పత్తి చేస్తాయని చీఫ్‌ ఎంటమాలజీ అధికారి రాంబాబు తెలిపారు. ప్రస్తుతం 23 కొలనులు, చిన్న కుంటల్లో వదిలిన అనంతరం చెరువుల్లోనూ వేస్తామని చెప్పారు.  

కొలనులు ఇవే...  
ఊరచెరువు (కాప్రా), చర్లపల్లి ట్యాంక్‌ (చర్లపల్లి), అంబీర్‌ చెరువు (కూకట్‌పల్లి), పెద్ద చెరువు (గంగారం), శేరిలింగంపల్లి, వెన్నెల చెరువు (జీడిమెట్ల), రంగధాముని కుంట (కూకట్‌పల్లి), మల్క చెరువు (రాయదుర్గం), నలగండ్ల చెరువు (నలగండ్ల), పెద్ద చెరువు (మన్సూరాబాద్‌), సరూర్‌నగర్, హుస్సేన్‌సాగర్‌ లేక్, సికింద్రాబాద్, పెద్ద చెరువు (నెక్నాంపూర్‌), లింగం చెరువు (సూరారం), ముళ్లకత్వ చెరువు (మూసాపేట్‌),  నాగోల్‌ చెరువు, అల్వాల్‌ కొత్త చెరువు,  నల్ల చెరువు (ఉప్పల్‌), పత్తికుంట (రాజేంద్రనగర్‌), బోయిన్‌చెరువు (హస్మత్‌పేట్‌), మియాపూర్‌ గురునాథ్‌ చెరువు, లింగంపల్లి గోపీ చెరువు, రాయసముద్రం చెరువు (రామచంద్రాపురం), కైదమ్మకుంట (హఫీజ్‌పేట), దుర్గం చెరువు. గణేశ్‌ నిమజ్జనానికి ఉపయోగించిన ఈ కొలనులను బతుకమ్మ నిమజ్జనాలకు కూడా వినియోగిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top