జీహెచ్‌ఎంసీకి బండ్లగూడ బాధ్యతలు

GHMC Handover to Bandlaguda Gram Panchayath - Sakshi

ఏడాది క్రితం గ్రేటర్‌లో విలీనం

ఇతర డివిజన్ల తరహాలోనే పనుల నిర్వహణ

జనరల్‌ ఫండ్స్‌ నుంచి పంచాయతీ ఉద్యోగుల వేతనాల చెల్లింపు

ప్రొసీడింగ్స్‌ జారీ చేసిన కమిషనర్‌

సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిక్రితం జీహెచ్‌ఎంసీలో విలీనమైన బండ్లగూడ గ్రామపంచాయతీ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ స్వీకరించింది.  గ్రామపంచాయతీ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలతో పాటు జీహెచ్‌ఎంసీలోని మిగతా వార్డులు(డివిజన్ల)మాదిరిగా పారిశుధ్యం, ఇంజినీరింగ్‌ తదితర పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ మంగళవారం ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. ప్రభుత్వం గత సంవత్సరం బండ్లగూడ గ్రామపంచాయతీని జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తెస్తూ 113 వార్డు(పటాన్‌చెరు)లో విలీనం చేసింది. అప్పటి కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక డిప్యూటీ కమిషనర్‌ బండ్లగూడ గ్రామపంచాయతీకి చెందిన రికార్డులన్నింటినీ సీజ్‌ చేశారు. దాంతో పంచాయతీ పరిధిలో ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సుల ఫీజుల తోపాటు భవననిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. ఆదాయం లేకుండా పోయింది. పంచాయతీకి చెందిన ఉద్యోగులు 27 మందికి గత  జూలై నుంచి జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో పంచాయతీ (మాజీ) కార్యదర్శి వినతి మేరకు ప్రస్తుత కమిషనర్‌ తగు చర్యలు చేపట్టారు. ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు జీహెచ్‌ఎంసీకి  ఆదాయం లభించేందుకుగాను అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటికి స్టాండింగ్‌ కమిటీ ఆమోదముద్ర పడాల్సి ఉండగా, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గత కొంతకాలంగా స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు జరగడం లేదు. తిరిగి స్టాండింగ్‌ కమిటీ  ఆమోదంతో బండ్లగూడ బాధ్యతలు జీహెచ్‌ఎంసీ పూర్తిగా చేపట్టేంతవరకు    ఆయా పనులు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 27 మంది ఉద్యోగుల జీతాలు రూ. 14.88 లక్షలు జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌ జనరల్‌ ఫండ్‌నుంచి చెల్లించాలని సూచించారు.

ఏప్రిల్‌ నుంచి  సంబంధిత శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ జనరల్‌ఫండ్‌ నుంచి చెల్లించాలని సూచించారు. వీటితో పాటు ఆస్తిపన్ను వసూలు చేసేందుకు సంబంధిత సర్కిల్‌లో ప్రస్తుతమున్న డాకెట్లతోపాటు బండ్లగూడ నుంచి ఆస్తిపన్ను సేకరణకు డాకెట్‌ ఏర్పాటు చేయాల్సిందిగా అడిషనల్‌ కమిషనర్‌(రెవెన్యూ)కు సూచించారు. అప్పటి వరకు ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సుల వసూళ్లకు రసీదు పుస్తకాలు ముద్రించి, వసూలు చేయడంతోపాటు మాన్యువల్‌ రసీదులివ్వాలన్నారు. జీహెచ్‌ఎంసీలోని మిగతా వార్డుల మాదిరిగానే భవననిర్మాణ, ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులు, నీటి సరఫరా, రోడ్లు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్, పారిశుధ్యం, ఎల్‌ఈడీ వీధిదీపాలు  తదితరమైన పనులు చేయాల్సిందిగా సంబంధిత విభాగాధిపతులకు సూచించారు. బండ్లగూడ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు దాని వార్షికాదాయం దాదాపు రూ. 30 లక్షలుగా ఉందని (మాజీ) కార్యదర్శి కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top