సెల్లార్‌ జాగ్రత్త! | GHMC Ban Sellar Works in Hyderabad | Sakshi
Sakshi News home page

సెల్లార్‌ జాగ్రత్త!

Jul 3 2019 7:22 AM | Updated on Jul 5 2019 8:12 AM

GHMC Ban Sellar Works in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సెల్లార్ల తవ్వకాలపై ఇప్పటికే నిషేధం విధించిన జీహెచ్‌ఎంసీ.. రానున్న రోజుల్లో కురిసే వర్షాలు, షేక్‌పేట వద్ద ఫ్లై ఓవర్‌ పనుల్లో క్రేన్‌ బోల్తాపడటం  తదితర పరిణాలను  దృష్టిలో ఉంచుకొని సెల్లార్లు తవ్వే యజమానులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారికి హెచ్‌ఎంసీ(హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌) యాక్ట్‌  మేరకు నోటీసులు జారీ చేయడమే కాక క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు చీఫ్‌ సిటీప్లానర్‌            ఎస్‌.దేవేందర్‌రెడ్డి తెలిపారు. పాటించాల్సిన నియమ, నిబంధనలను మరోసారి వెల్లడించారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో భారీ వర్షాలొస్తాయనే సూచనలున్నందున అన్ని సర్కిళ్లలోని ఏసీపీలు తగిన చర్యలు తీసుకోవాలి. విధుల్లో నిర్లిప్తత, నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. జోనల్‌ సీపీలు తమ జోన్‌లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, నివేదికలు అందజేయాలని సూచించారు. 

వర్షాకాలం ముగిసేంత వరకు కొత్తగా గ్రేటర్‌లో సెల్లార్ల తవ్వకాలు చేపట్టరాదు.
ఇప్పటికే సెల్లార్లు తవ్వి పనులు పురోగతిలో ఉన్నవారు తగిన భద్రత చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా నేల బలంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. పనులు చేసే చోట రిటైనింగ్‌వాల్, బారికేడింగ్‌ తదితర ఏర్పాట్లు చేయాలి.
సెల్లార్‌ తవ్వి వదిలేసిన ప్రాంతాల్లో పరిసరాల్లోని నిర్మాణాలు పటిష్టంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు సెల్లార్‌ గుంతను నిర్మాణ వ్యర్థాలతో నింపేయాలి. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ అండ్‌ డీ వేస్ట్‌ వింగ్‌ సహకారం తీసుకోవచ్చు.
ఈ నిబంధనలు పాటించకుంటేనోటీసులతో పాటు క్రిమినల్‌ కేసులనమోదు తప్పవు.  
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ వంటి కొండ ప్రాంతాలు, నేల స్లోపుగా ఉన్న ప్రాంతాల్లోని భవనాల పక్కన, దిగువన, రిటైనింగ్‌వాల్స్‌ వెంబడి తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలి.
అధికారులందరూ అప్రమత్తంగా ఉండి వాతావరణశాఖ, కంట్రోల్‌ రూమ్స్‌ నుంచి వెలువడే సూచనల కనుగుణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలి.  

కొనసాగుతున్నశిథిల భవనాల తొలగింపు
నగరంలో శిథిల భవనాల తొలగింపు స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోందని దేవేందర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత ప్రమాదకర భవనాలకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నివాసితులను  ఖాళీ చేయించడంతో పాటు బిల్డింగ్‌కు సీలు వేయడం, బారికేడింగ్‌ చేయడం వంటి పనులు చేయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు సూచించారు.
ప్రజలు  సదరు భవనాల సమీపంలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక నోటీసులుప్రదర్శించాలని ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement