
నాగేందర్ ఆటలు ఇక సాగవు
చిన్నచిన్న కేసులున్నాయంటూ సామాన్య కార్యకర్తలను బైండోవర్లు చేస్తున్న పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులున్న...
- వైఎస్సార్ సీపీ నేత విజయారెడ్డి
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: చిన్నచిన్న కేసులున్నాయంటూ సామాన్య కార్యకర్తలను బైండోవర్లు చేస్తున్న పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులున్న మాజీ మంత్రి దానం నాగేందర్‌ను ఎందుకు బైండోవర్ చేయడంలేదని వైఎస్సార్ సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గం కన్వీనర్ పి.విజయారెడ్డి ప్రశ్నించారు. పెద్దలకు ఓ న్యాయం, పేదలకు మరో న్యాయమా అని పోలీసుల తీరుపై మండిపడ్డారు. శనివారం బంజారాహిల్స్ రోడ్డు నెం.10లోని గౌరీశంకర్ కాలనీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకెళ్తుంటే వాహనాల తనిఖీల్లో దొరికాయంటూ ప్రకటనలు ఇస్తున్న పోలీసులకు మాజీ మంత్రి దానం ఇంటి వద్ద నిత్యం డబ్బు జాతర జరుగుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బైండోవర్లు జరుగుతున్నాయని, ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
తాము కాలనీల్లో పాదయాత్ర చేస్తుంటే పోలీసులు వెంబడిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, పోలీసులే తమ కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్‌లో తిరగాలంటూ ఆదేశిస్తున్నారన్నారు. పీజేఆర్ పేరు చెప్పుకుని గత ఎన్నికల్లో గెలిచిన నాగేందర్ ఇప్పుడు పీజేఆర్ అనుచరులను తొక్కిపెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్‌లో దానంకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుందని సర్వేలు చెప్పడంతో ఏమీచేయలేక ఆయన ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్బీనగర్‌లోని బడుగులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు వస్తే తాను లాయర్‌ను ఏర్పాటు చేసి కోర్టులో పోరాడి వారికి న్యాయం చేశానన్నారు.అయిదేళ్ల పాలనలో ఖైరతాబాద్‌లో పేద, ధనిక అన్న తేడా లేకుండా అధికార పార్టీ నరకం చూపించిందని, విసుగెత్తి అందరూ వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో నాగేందర్ ఎంత డబ్బు వెదజల్లినా ఇంటికే పరిమితమవుతారన్నారు. అధికారం కోసం రాత్రికి రాత్రే పార్టీలు మార్చిన నాగేందర్‌కు తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. భీంరావ్‌బాడలో పేదల ఇళ్లను నామరూపాల్లేకుండా చేసిన దానం నోటీసుల పేరుతో అనేక బస్తీలను అతలాకుతలం చేస్తున్నారని, మరోసారి గెలిస్తే బస్తీలు మిగలవన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.