కరువు నేలపై జలసిరులు

Full Tank Level Of The Lakes In Rangareddy District - Sakshi

పదేళ్ల తర్వాత తాడిపర్తిలో అలుగు పారుతున్న కుంటలు 

రెండుమూడు రోజుల్లో నిండనున్న బంధం చెరువు 

సాక్షి, యాచారం: కరువు నేలపై జలసిరులు సవ్వడి చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో.. పదేళ్ల తర్వాత కుంటలు నిండి నీళ్లు అలుగు పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రబీపై ఆశలు కలుగుతున్నాయి. జిల్లాలోని యాచారం, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల మండలాల సరిహద్దులో 15 వేలకు హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం, ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ 20 నుంచి 30 వరకు కుంటలు, ఐదారు చెరువులు ఉన్నాయి. వారంరోజులుగా కురస్తున్న వానలతో యాచారం మండలంలోని తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో గండి కుంట, ఎర్ర కుంట, ఎకతాయి కుంట, తాటి కుంట, తమ్మల కుంటలతో పాటు తలాబ్‌ చెరువు, కుర్మిద్ద చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. అడవీప్రాంతం నుంచి వచ్చే నీటితో తాడిపర్తిలోని బంధం చెరువు రెండుమూడు రోజుల్లో నిండే అవకాశం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో నిండిన కుంటలు ప్రస్తుతం పొంగిపొర్లుతుండడంతో కర్షకుల ముఖాల్లో సంతోషం సుస్పష్టంగా కనిపిస్తోంది.

పెరగనున్న భూగర్భజలాలు  
కుంటలు, చెరువులు నిండడంతో యాచారం, ఆమనగల్లు, కందుకూరు, కడ్తాల్, మాడ్గుల మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగే  అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తాడిపర్తిలో కుంటలు అలుగుపోస్తుండడంతో గొల్లగూడెం మీదుగా నీళ్లు పారుతున్నాయి. కుంటల నుంచి లీకేజీలు కావడంతో సర్పంచ్‌ రమేష్‌ ఇరిగేషన్‌  శాఖ ఏఈ శ్రీకాంత్‌ సాయంతో మరమ్మతులు చేయించారు. గొల్లగూడెం మీదుగా నీళ్లు రాకుండా నానక్‌నగర్‌ చెరువులోకి నీళ్లు మళ్లించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో దాదాపు 8 వేలకు పైగా బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి 15 నుంచి 20 వేల ఎకరాల్లో రబీ పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. చెరువులు, కుంటలు నిండడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు మేలు జరిగి జీవనోపాధి కలిగే అవకాశం ఉంది.

సంతోషంగా ఉంది  
పదేళ్ల తర్వాత చెరువులు, కుంటలు నిండడం సంతోషంగా ఉంది. ఇక  వ్యవసాయానికి ఏ ఇబ్బంది ఉండదు. తాడిపర్తితోపాటు నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి, మల్కీజ్‌గూడ, తక్కళ్లపల్లి, మొండిగౌరెల్లి, యాచారం, నందివనపర్తి గ్రామాల్లోని బోర్లల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి వానలతో రబీపై ఆశ కలిగింది.     
 – దూస రమేష్, సర్పంచ్‌ తాడిపర్తి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top