ఫ్రెండ్స్‌గా తాము నివసించిన ఇంటి నంబర్‌తో సంస్థ

Friends Tour State Art Gallery Exhibition in Hyderabad - Sakshi

కళే ఆధారంగా కాలేజీ స్నేహం 

దూరంగా ఉంటున్న నలుగురు కలిసి కళా ప్రదర్శన ఏర్పాటు  

స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో నేడు ఎగ్జిబిషన్‌ ప్రారంభం

ఫ్రెండ్స్‌గా తాము నివసించిన ఇంటి నంబర్‌తో సంస్థ  

‘ది 16/622 కలెక్టివ్‌...’ ఇది చూస్తే ఏదో ఇంటి నంబర్‌లా ఉంది కదూ! కానీ ఇదొక సంస్థ పేరు. వాస్తవానికి ఇది డోర్‌ నంబరే.. కానీనలుగురు యువతులు దీన్ని సంస్థ పేరుగా మార్చారు. వారిసృజనాత్మకతకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఖండాంతరాల్లో నివసిస్తున్న ఆ నలుగురు యువతులు కలిసి తొలిసారిగా భారత్‌లో అదీ మన నగరంలో ఏర్పాటు చేస్తున్న మిక్స్‌డ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  ‘ఏ యూలజీ టు దట్‌ థింగ్స్‌ నెవర్‌ వెర్‌’ అంతకుమించినసృజనశీలురుగా వీరిని మనకు పరిచయం చేస్తుంది. 

సాక్షి, సిటీబ్యూరో: కలకాలం నిలిచేదే స్నేహం అంటారు. కళ కూడా అంతే. ఈ నలుగురు స్నేహితులు తమ స్నేహాన్ని వర్ధిల్లజేసుకోవడానికి కళనే ఆధారం చేసుకున్నారు. ‘మేం స్నేహితులం అనేకన్నా అందరం ఒక ఫ్యామిలీగానే భావిస్తాం’ అని ఈ బృందంలోని లలిత చెప్పారు. ప్రస్తుతం అమెరికా, లండన్‌ ఇలా ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటున్నా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వీరంతా కలిసింది కేవలం ఒక చిత్ర ప్రదర్శన కోసం మాత్రమే కాదు... తమ స్నేహాన్ని కలకాలం కళకళలాడేలా చేసుకోవడానికి కూడా. 

కళా కంపెనీ...  
కాలేజీ రోజుల్లో గుర్‌గావ్‌కు చెందిన ప్రగ్యా భార్గవ, బెంగళూర్‌కి చెందిన అపరాజిత, సింగపూర్‌కి చెందిన వికీ అరవిందన్‌లతో పాటు మన నగరానికి చెందిన లలితా భండారు స్నేహితులు. విద్యార్థులుగా ఉన్నతస్థాయి ప్రతిభ చూపిన వీరంతా... తమ తమ అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, శిల్పకళ, వీడియోగ్రఫీలలో మంచి నైపుణ్యం సాధించారు. సింగపూర్‌లో కాలేజీ కోర్సులు పూర్తయ్యాక వీరి దారులు వేరయ్యాయి. కెరీర్‌ అన్వేషణలో ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కళాశాల చదువైపోయి విడిపోయినా కళలతో కలిసుందామని నిశ్చయించుకున్న వీరు... దీని కోసం ఇటీవల ఒక కంపెనీని ప్రారంభించారు. తామంతా కలిసి నివసించిన ఇంటి నంబర్‌నే ఆ కంపెనీ పేరుగా పెట్టారు. ‘రకరకాల కళా ప్రదర్శనల్లో పాల్గొంటున్నా, ఆ విశేషాలు ఏదో రూపంలో పంచుకుంటున్నా ఏదో వెలితి. నలుగురం కలిసి మా మధ్య ఉన్న గాఢమైన స్నేహానుభూతిని ఆస్వాదిస్తూనే అదే సమయంలో ఆ సమయాన్ని కూడా మాలోని ప్రతిభా ప్రదర్శనకు వెచ్చించాలని, అందుకు ఏదైనా చేయాలని అనిపించింది. ఆ ఆలోచనలో నుంచే మా ‘ది 16/622 కలెక్టివ్‌’ పుట్టింద’ని చెప్పారు లలిత. సింగపూర్‌లో తాము కలిసి నివసించిన ఇంటి నంబర్‌నే తమ కంపెనీ పేరుగా మార్చుకున్నామని, ‘ప్రస్తుతం ఆ ఇల్లు కూల్చేశారు. కానీ ఆ ఇంటిలో నివసించిన మా జ్ఞాపకాల్ని పదిలం చేసుకోవాలనుకున్నాం’ అని వివరించారు.  

సింగపూర్‌ టు మాదాపూర్‌...  
సింగపూర్‌లో పుట్టిన వీరి స్నేహం మాదాపూర్‌ వరకు ప్రయాణం చేసింది. మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో వీరు నలుగురు కలిసి తొలి కళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ శనివారం ప్రారంభం కానుంది. ‘ఈ ప్రదర్శన కోసం మన ఊహల్లోనే తప్ప నిజంగా చూడడం సాధ్యపడని కొన్నింటికి రూపం ఇవ్వాలని అందరం కామన్‌ థీమ్‌ తీసుకున్నాం. ప్రగ్యా ఫొటోగ్రఫీ, డ్రాయింగ్‌.. అపరాజిత మిక్స్‌ మీడియా పెయింటింగ్స్‌.. నా పెయింటింగ్స్‌... వికీ అరవింద్‌ శిల్పాలు, వీడియోలు.. ఇలా అన్నీ ఈ థీమ్‌తోనే రూపుదిద్దుకున్నాయి’ అని వివరించారు లలిత. ఈ ప్రదర్శన పది రోజులు కొనసాగుతుందని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top