రోబో 4.O

Fourth Generation of Robot was Launched - Sakshi

దేశంలోనే తొలి ‘నాలుగో తరం’ రోబో ప్రారంభం

అందుబాటులోకి తెచ్చిన సన్‌షైన్‌ ఆస్పత్రి 

సాక్షి, హైదరాబాద్‌: తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్‌షైన్‌ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక ‘నాలుగో తరం’ రోబోను ప్రవేశపెట్టింది. శనివారం సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, సన్‌షైన్‌ ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు.

మోకాలి చిప్ప, తుంటి ఎముక అరుగుదల భాగాన్ని కచ్చితంగా గుర్తించి, ఆ మేరకు కంప్యూటర్‌ నావిగేషన్‌ సాయంతో సరైన ప్రమాణం నిర్ధారించుకుని, శస్త్రచికిత్స సమయంలో ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా ఇంప్లాంట్‌ను విజయవంతంగా అమర్చే ప్రక్రియలో ఈ రోబో సాయపడుతుందని, దీంతో రోగికి తక్కువ రక్తస్రావం, నొప్పితోపాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బెడద లేకుండా త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుందని గురువారెడ్డి తెలి పారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆదర్శ్‌ అన్నపరెడ్డి, డాక్టర్‌ కుషాల్‌ హిప్పల్‌గావన్‌కర్, డాక్టర్‌ సుహాన్‌తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘శాస్త్ర విజ్ఞాన ఫలాలను కింది స్థాయి ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఖరీదైన చికిత్సలను తక్కువ ధరలకే అందిస్తూ గురవారెడ్డి ఎంతోమంది వైద్యులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఏ వ్యక్తి రాణించాలన్నా కష్టపడకుండా, ఇష్టపడకుండా సాధ్యం కాదు, గురవారెడ్డి 30 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. వేలాది మందికి విశ్వాసాన్ని కల్పించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు’ అని అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top