ఈతకు వెళ్లి నలుగురి దుర్మరణం

 Four students going swimming were dead - Sakshi

రుద్రారం సమీపంలోని పెద్దకుంట వద్ద ఘటన 

మృతులు హైదరాబాద్‌ అల్వాల్‌ బాలాజీ నగర్‌వాసులు

పటాన్‌చెరు టౌన్‌: పెద్దకుంటలో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ అల్వాల్‌ బాలాజీనగర్‌కు చెందిన నందిని (15), గోవర్ధన్‌ (16), ఆనంద్‌ (17), లోకేష్‌ (10)లు వేసవి సెలవులు కావడంతో సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామం గీతం విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆ పక్కనే ఉన్న పెద్దకుంటలో ఈతకు వెళ్లారు.

మొత్తం ఆరుగురు కలిసి కుంట వద్దకు వెళ్లగా అందులో నందిని, గోవర్ధన్, ఆనంద్, లోకేష్‌లు ఈత కోసం పెద్దకుంటలోకి దిగారు. మిగతా ఇద్దరు దివ్య, అమూల్య ఒడ్డున కూర్చున్నారు. కుంటలోకి దిగిన నలుగురికి ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఈ విషయాన్ని దివ్య, అమూల్య కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వచ్చే సరికే నలుగురూ మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి
కందనూలు (నాగర్‌కర్నూల్‌): సరదాగా చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీపంలోని సూర్యకుంట చెరువులో చేపలు పట్టేందుకు బొక్కి శైలజ (12), మండల స్వాతి (9), మండల అనిల్‌ (10), గణేశ్‌లు వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు వారు నీటిలో మునిగిపోయారు. గమనించిన గ్రామస్తుడు వెంకటయ్య నీటిలో మునిగిపోతున్న గణేశ్‌ను కాపాడి జిల్లా ఆస్పత్రికి తరలించాడు. మృతుల్లో మండల స్వాతి, అనిల్‌ అన్నా చెల్లెళ్లు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై లక్ష్మీనర్సింహులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top