హైదరాబాద్‌లో ఫారిన్‌ పోస్టాఫీస్‌ 

Foreign Post Office Will Built In Hyderabad - Sakshi

హుమాయూన్‌నగర్‌ తపాలా కార్యాలయంలో ఏర్పాటు

వచ్చేనెల ఒకటి నుంచి అందుబాటులోకి సేవలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన విశ్వాస్‌ తయారీ రంగంలో వ్యాపారం ప్రారంభించాడు. మందులు, బలవర్ధకమైన పదార్థాల తయారీకి సంబంధించి చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు. పోస్టాఫీస్‌ల ద్వారా పార్శిళ్లను ఎగుమతి చేస్తున్నాడు. అలాగే కొన్ని ముడి సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. పార్శిళ్ల రూపంలో జరిగే దిగుమతి ఎగుమతుల్లో పెద్ద చికాకు ఎదురైంది. హైదరాబాద్‌లో తపాలా శాఖకు సంబంధించి ఫారిన్‌ పోస్టాఫీస్‌ లేకపోవటంతో కస్టమ్స్‌ ఎగ్జామినేషన్‌ కోసం పార్శిళ్లను ముంబై పంపుతున్నాడు. కొన్ని పార్శిళ్ల క్లియరెన్సుకు పక్షం రోజుల నుంచి నెలకు పైబడి సమయం పడుతోంది. అలాగే కస్టమ్‌ డ్యూటీ ఎంత చెల్లించాలో ముందు తెలియక అప్పటికప్పుడు ముంబై పరుగెత్తాల్సి వస్తోంది. ఇది కేవలం విశ్వాస్‌ ఒక్కడి సమస్యే కాదు. చివరకు ఇతర దేశాల్లో ఉండే బంధువులకు పంపే పార్శిళ్లలో కూడా ఇదే సమస్య ఏర్పడుతోంది. దేశంలోనే ఓ ప్రధాన నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్‌కు ఇంతకాలం ఇదో సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నగరంలో ఫారిన్‌ పోస్టాఫీస్‌ ఏర్పాటు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది పూర్తిస్థాయిలో పని ప్రారంభించనుంది.

ఇప్పటివరకు ఆ నాలుగు చోట్లే.. 
దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటికి కొన్ని చొప్పున దేశాలను కేటాయించారు. ఆయా దేశాలకు ఎగుమతి కావాల్సిన, దిగుమతి కావాల్సిన పార్శిళ్లు ఆయా నగరాల్లోని ఫారిన్‌ పోస్టాఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి అమెరికా, యూ రప్, గల్ఫ్‌ దేశాలకు ఎక్కువ పార్శిళ్లు ఎగుమతి అవుతాయి. ఇవి ముంబైకి వెళ్లాల్సి ఉంటుంది. ముంబైలో లక్షల సంఖ్యలో పార్శిళ్లు పేరుకుపోతుండటంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఈలోపు కొన్ని సరుకులు పాడైపోతున్నాయి. ఇది పెద్ద సమస్యగా పరిణమించింది. 

ఎట్టకేలకు రాజధానిలో.. 
ఈ సమస్యను గుర్తించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఈసీ) దేశవ్యాప్తంగా అదనంగా ఫారిన్‌ పోస్టాఫీసులను ఏర్పాటు చేయాలంటూ 2016లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌ను కూడా చేర్చింది. కానీ దాని ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు తపాలా శాఖ సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగంతో కలసి ఇప్పుడు ఫారిన్‌ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని హుమాయూన్‌నగర్‌ తపాలా కార్యాలయంలో ఇందుకు కొంత స్థలాన్ని కేటాయించారు. ఇక్కడే సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటు చేసింది. ఇక నుంచి విదేశాలకు ఎగుమతయ్యే, విదేశాల నుంచి దిగుమతయ్యే పార్శిళ్లను ఇక్కడే తనిఖీ చేస్తారు. అవసరమైన వాటికి కస్టమ్‌ డ్యూటీ కట్టించుకుని డెలివరీకి వీలుగా తపాలా సిబ్బందికి అందిస్తారు. 

ఎగుమతులకు ప్రోత్సాహం.. 
నగరం ఇప్పుడు ఎన్నో ఉత్పత్తులకు హబ్‌గా మారుతోంది. శివారు ప్రాంతాల్లో తయారీ రంగం విస్తరిస్తోంది. ఫార్మాతోపాటు చాలా వస్తువులు ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. వీటిల్లో తక్కువ పెట్టుబడితో చిన్నస్థాయి తయారీ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పెద్దపెద్ద యూనిట్లు షిప్పింగ్‌ ద్వారా ఎగుమతి చేస్తుండగా.. చిన్నచిన్న తయారీ యూనిట్లు మాత్రం తపాలా ద్వారా పార్శిళ్ల రూపంలో పంపుతోంది. ఇంతకాలం ఫారిన్‌ పోస్టాఫీసు లేకపోవటంతో ఎగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వారంతా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇక్కడే ఫారిన్‌ పోస్టాఫీసు ఏర్పాటు అవటంతో జాప్యం బాగా తగ్గి ఎగుమతులు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో పార్శిళ్లు ఎగుమతవుతున్నాయి. ఆ సంఖ్య బాగా పెరిగి ఎగుమతులకు ప్రోత్సాహం లభించినట్లవుతుంది.

విదేశాలకు నిత్యం వేలల్లో పార్సిళ్లు.. 
నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విదేశాలకు పార్శిళ్లు ఎగుమతవుతుంటాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. దేశాల మధ్య సరఫరా అయ్యే ఈ పార్శిళ్లన్నింటిని కచ్చితంగా కస్టమ్స్‌ ఎక్సైజ్‌ విభా గం తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో నిషేధిత వస్తువులు, సరుకులు ఎగుమతి, దిగుమతి కాకుం డా నిరోధించటంలో భాగంగా ఈ తనిఖీ తప్పనిసరి. పార్శిళ్లను బుక్‌ చేసే వారు వాటిల్లో ఉన్న వస్తువుల వివరాలు పేర్కొంటూ డిక్లరేషన్‌ ఇస్తారు. డిక్లరేషన్‌లో పేర్కొన్న వస్తువులే అందులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా యంత్రాలతో స్కాన్‌ చేయాల్సిందే. నిబంధనల ప్రకారమే దిగుమతి, ఎగుమతి ప్రక్రియ సాగుతోందని స్పష్టమైన తర్వాతే వాటిని తరలించేందుకు కస్టమ్స్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగం అధికారులు పచ్చజెండా ఊపుతారు. అవసరమైతే కస్టమ్‌ డ్యూటీ కట్టించుకుంటారు. కానీ హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఫారిన్‌ పోస్టాఫీస్‌ లేకపోవటంతో స్థానికంగా ఈ ప్రక్రియకు వీల్లేకుండా పోయింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top