వినండి.. వినండి.. ఉల్లాసంగా...

FM Radio Services At Kandi Jail In Medak District - Sakshi

జైలులో ఎఫ్‌ఎం రేడియో సేవలు

ఇప్పటికే సెంట్రల్‌ జైళ్లలో అమలు

జిల్లాస్థాయిలో మొదటగా కందిలోని జైలులో అందుబాటులోకి  

ఈ నెల 10న రేడియో సేవలు ప్రారంభం ∙రేడియో జాకీలుగా ఖైదీలు  

సంగారెడ్డి అర్బన్‌: రాష్ట్రంలోనే మొదటిసారిగా సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని జిల్లా జైలులో ఈనెల 10వ తేదీన ఎఫ్‌ఎం రేడియో ప్రారంభం కానుంది. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌ సెంట్రల్‌ జైళ్లలో ఇప్పటికే ఎఫ్‌ఎం రేడియో సేవలు ఖైదీలకు అందుతున్నాయి. డీజీ వీకే సింగ్, ఐజీ సైదయ్య ఆదేశాల ప్రకారం జిల్లా అధికారులు గతంలో ఇక్కడి జైలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోలు పంపు, సూపర్‌మార్కెట్, హెయిర్‌ కటింగ్‌ సెలూన్, గ్రంథాలయాలు విజయవంతం కావడమే కాకుండా ఖైదీల్లో మార్పును తీసుకు వచ్చాయి. కాగా, ఎఫ్‌ఎం రేడియో అంతర్రాష్ట్ర ఖైదీలు, నిరక్షరాస్యులైన ఖైదీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.  

ఎఫ్‌ఎం రేడియో పనితీరు ఇదీ.. 
జైల్‌ ఎఫ్‌ఎం రేడియోని కేవలం ఖైదీలు, జైలు లోపల ఉండే అధికారులు, సిబ్బందికి వినిపించడానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఖైదీలను కలవడానికి (ములాఖత్‌) వచ్చే వారు ఉండే చోట స్పీకర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 6 బ్లాక్‌లలో 8 స్పీకర్లు అమర్చారు. అదనంగా మరో 4 అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఫ్‌ఎం రేడియోలో పనిచేయడానికి ఐదుగురు రేడియో జాకీలను ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగా రిహార్సల్స్‌ చేయిస్తున్నారు. వీరేకాక మరో ఐదుగురిని జాకీలుగా ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. జైలు ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రసారం చేసే కార్యక్రమాలు ఖైదీల్లో ఉత్సాహం నింపడమేకాక మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయని అధికారులు చెబుతున్నారు.  

కార్యక్రమ వివరాలు... 
‘వెల్‌కమ్‌ టు మీ అంతర్‌వాణి.. జైలు ఖైదీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు..’అంటూ ఖైదీ రేడియో జాకీలు ఉదయం నుంచే పలుకరిస్తుంటారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రస్తుతానికి జైలు కార్యక్రమాలన్నీ వైర్‌లెస్‌ సెట్లు, అందుబాటులో ఉన్న ఖైదీల ద్వారా సమాచారం చేరవేయడంద్వారా జరుగుతుండగా, ఇక నుంచి ఎఫ్‌ఎం రేడియో ద్వారానే సమాచారాన్ని చేరవేస్తారని అంటున్నారు. బయట నుంచి ఎవరైనా ఖైదీని కలవడానికి వస్తే ఆ వివరాలను రైల్వే, బస్సు స్టేషన్‌లలో అనౌన్స్‌ చేసినట్లుగా జాకీలు వినిపిస్తారు. ఎప్పటికప్పుడు జైలు సమాచారం. మధ్య, మధ్యలో భక్తిరస, వినోదాత్మక పాటలు, తాజా వార్తలను ఎఫ్‌ఎం రేడియో ద్వారా వినిపిస్తారు. జైలుకు వచ్చే ఉన్నతాధికారులు సైతం తమ సందేశాన్ని ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఖైదీలకు వినిపించే వీలుంటుందని చెబుతున్నారు.  

బతుకులు మారుస్తున్న బందీఖాన... 
బయటి ప్రపంచం విషయాలు తెలియడంతో పాటు, అంతర్గతంగా సరదాగా గడపడానికి రేడియో సేవలు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఖైదీలు చెబుతున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్షపడి ఇక్కడికి వచ్చాక వారిలో మార్పు తెచ్చేలా కంది జైలు వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా జైలులో చుట్టూ పచ్చటి చెట్లు, ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. సూపర్‌మార్కెట్‌ను నిర్వహించడం, పురుషుల హెయిర్‌ సెలూన్, పెట్రోలు పంపు నిర్వహణతో సంగారెడ్డి జైలుకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు వచ్చింది. మంచి ప్రవర్తనతో విడుదలైన ఐదుగురు ఖైదీలు పెట్రోలు పంపులో పనిచేస్తుండగా మరో నలుగురు ఖైదీలు కూడా ఇందులో పనిచేస్తున్నారు. 

కంది జైలులో ఓపెన్‌ జిమ్‌ 
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని జైలులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాదిన జైల్లో ఈ విధమైన జిమ్‌ ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం కానుంది. జైలు ఆవరణలో ఓపెన్‌ జిమ్‌ కోసం స్థలాన్ని చదును చేశారు. జైలులో ఉన్న పరికరాలతోనే తక్కువ ఖర్చుతో జిమ్‌ను ఏర్పాటు చేసి ఖైదీలను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచేందుకు కృషిచేస్తున్నామని జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌ గౌడ్‌ తెలిపారు.  

ఖైదీల్లో కళలను ప్రోత్సహిస్తాం 
ఖైదీల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికి ఈ నెల 10న జిల్లా జైలులో ఎఫ్‌ఎం రేడియోని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర జైళ్లశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం అంతర్‌వాణి అని నామకరణం చేశాం. ఇది ఖైదీలకు అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. ప్రముఖ వ్యక్తులను పిలిచి రేడియో ద్వారా ఖైదీలకు సందేశం ఇప్పిస్తాం. వారిలో దాగిఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీస్తాం. మిగతా కార్యక్రమాల్లాగే ఎఫ్‌ఎం రేడియో విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా.

– శివకుమార్‌గౌడ్, జైలు సూపరింటెండెంట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top