ఆర్టీసీ బస్సు, లారీ ఢీ 

Five People were Seriously Injured in the Madak Road Accident  - Sakshi

ఐదుగురికి తీవ్ర గాయాలు  

మెదక్‌ జిల్లా అల్లాదుర్గం శివారులో ఘటన  

రెండు రోజుల్లో రెండో ప్రమాదం 

అల్లాదుర్గం(మెదక్‌): మెదక్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం అల్లాదుర్గం శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణఖేడ్‌ డిపోకు చెందిన (టీఎస్‌ 15యూఏ 6100) బస్సు ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరింది. బస్సు అల్లాదుర్గం శివారు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ (ఎంహెచ్‌ 30ఏబీ 3237) ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో బస్సు డ్రైవర్‌ జలంధర్‌కు కాలు విరిగి, తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దశంకరంపేట మండలం మల్కాపూర్‌కు చెందిన మోహన్, లక్ష్మి, నాగమణి, రత్నమ్మకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో జోగిపేట ఆస్పత్రికి తరలించారు.

కండక్టర్‌ శివశంకర్, గొర్రెకల్‌కు చెందిన మణెమ్మ, రమేశ్‌తోపాటు మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ పలువురు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీసీ బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్‌ తెలిపారు. లారీ వేగంగా వచ్చి బస్సును ఢీ కొనడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. లారీ వస్తున్న వైపు పెద్ద చెట్టు కొమ్మ ఉండడంతో, దాన్ని తాకకుండా తప్పించే క్రమంలో బస్సును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో జోగిపేట వైపు వెళ్తున్న పెద్దశంకరంపేట ఎస్‌ఐ గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించేందుకు సహాయం అందించారు. ఈ సంఘటనపై అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

రెండు రోజుల్లో రెండో ప్రమాదం 
అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ పెళ్లి బస్సు, కంటైనర్‌ ఢీకొన్న సంఘటనలో 30 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి రెండు రోజులు గడవక ముందే ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రమాదాల్లో బస్సుల్లో 50 మందికి పైనే ప్రయాణికులు ఉన్నారు. అదృష్టం బాగుండి అంతా బయటపడ్డారని లేదంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top