డబ్బులు ఇవ్వండి... పట్టుకోండి...

Fishermens Gave Bribe for Catching Fish in Ellampally Reservoir - Sakshi

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ‘డబ్బులు ఇవ్వండి.. పట్టుకోండి’.. అంటే దేని గురించి అని అనుకుంటున్నారా..? ఇందులోనే అసలు కథ ఉంది. దీనిలోకి వెళ్తే వివరాలిలా ఉన్నాయి. హాజీపూర్‌ మండలంలోని గుడిపేట గ్రామ శివారులో గోదావరి నదిపై ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్స్య సంపద ఉంది. నిత్యం గుడిపేట పరిధిలోని మత్స్యకారులు చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రతీ ఏడాది జూలై 1 నుంచి మొదలు ఆగస్టు 31 వరకు అంటే సరిగ్గా రెండు నెలల పాటు చేపలు పట్టరాదని మత్స్యశాఖ నిబంధనల మేరకు స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయి. ఈ రెండు నెలల కాలంలో చేపల ఉత్పత్తి గణనీయంగా ఉంటుందనే కారణంతో చేపలు పట్టేందుకు నిషేదాజ్ఞలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మత్స్యకారులు చేపలు పట్టకుండా సంయమనంతో ఉన్నా ఇటీవల కొత్తగా వ్యవహరిస్తున్నారు. వివరాలు ఏంటని ఆరా తీస్తే అసలు భాగోతం బయటపడింది. గుడిపేట–నంనూర్‌ మత్స్యకారుల సంఘంలోని సభ్యులంతా ఒక తీ ర్మానం చేసుకున్నారు. దాదాపు వంద మంది స భ్యులు ఒక్కొక్కరూ రూ. 300ల వరకు వేసుకుని దాదాపు రూ. 30 వేలు జమ చేశారు. మత్స్యశాఖ ద్వారా చేపలు పట్టుకోకుండా నోటీసులు అందుకున్న సభ్యులంతా మత్స్యశాఖ అధికారులకు ఈ 30 వేలు ముట్టజెప్పి చేపలు పట్టుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు ప్రాజెక్ట్‌ వైపు దృష్టి పెట్టకపోవడంతో వీరు దర్జాగా చేపలు అమ్మకుంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top