ఆమె.. కవనం జ్వలనం

The first Telugu poet Kuppambika - Sakshi

..: సంగిశెట్టి శ్రీనివాస్‌

దేశ స్వాతంత్య్రానికి ముందే స్వతంత్రంగా ఆలోచించి కవిత్వం చెప్పిన కవయిత్రులు మనకున్నారు. తెలుగు మహాసభల సందర్భంగా ఆ స్ఫూర్తిదాతలను తలచుకుందాం.
తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక
సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమ మొదలు నేటి వరకూ తెలంగాణలో స్త్రీల శౌర్యము ఎంతగానో ఉంది.  ఘనమైన పాత్ర పోషించి చరిత్రకెక్కిన మహిళల గురించి ఇవ్వాళ చర్చించుకుంటున్నాం. ఈ చర్చలు చర్యలుగా మారాయి. ఆ చర్యలు పరిశోధనగా మారి తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వెలుగులోకి వచ్చింది. ఆమె రాసిన పద్యాల్లో ఇప్పుడైతే ఒకటే అందుబాటులో ఉంది. దాని ఆధారంగా ఆమెను తొలి తెలుగు కవయిత్రిగా నేను నిర్ధారించడం జరిగింది. ఈమె రంగనాథ రామాయణము గ్రంథకర్త గోన బుద్ధారెడ్డి కూతురు. 

తొలి ఉర్దూ కవయిత్రి మహలఖాబాయి చాందా
తెలంగాణలో తమ కళల ద్వారా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వారిలో తారామతి, ప్రేమావతి ఉన్నారు. వీళ్లు ప్రేమను కేంద్రంగా చేసుకొని రాశారు. హైదరాబాద్‌ నగరమే ప్రేమ పునాది మీద ఏర్పడింది. చంచల్‌గూడాలో ఉండే భాగమతిని ప్రేమించిన యువరాజు ఆమె కోసం మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్న కాలంలో తన గుర్రంపై సవారి అయి వచ్చేవాడు. యువరాజు సాహసం చూసి చలించిన రాజు ‘పురానా ఫూల్‌’ని కట్టించాడు.  నిజాం రాజవంశానికి చెందిన హయత్‌ బ„Š  బేగమ్‌ హైదరాబాద్‌లో బ్రిటిష్‌ రెసిడెంట్‌గా ఉన్న కిర్క్‌ పాట్రిక్‌ని ప్రేమించి 1800 ప్రాంతంలో వివాహమాడింది. హైదరాబాద్‌ ప్రేమతత్వానికి ఇట్లాంటి అనేక నిదర్శనాలున్నాయి. సాహిత్యంలో కూడా వీటి ప్రతిఫలనాలున్నాయి. వాటిలో ఉర్దూలో మహలఖాబాయి చాందా ప్రముఖురాలు.  ఉర్దూలోమొదటిసారిగా కవిత్వం రాసిన మహిళ మహలఖాబాయి. ఈమెకు నిజాం ఖాందా తో ‘ప్రేమ’ పూరిత సంబంధాలున్నాయి.    

తొలి తెలంగాణ ఆధునిక కవయిత్రి రత్నమాంబ
తెలంగాణకు తొలి ఆధునిక కవయిత్రి పెనుగోళ్ళ రత్నమాంబ దేశాయి. 1847లో పరిగి తాలూకా ఇప్పటూరులో జన్మించిన ఈమె వేంకటరమణ శతకము, శ్రీనివాస శతకము, బాలబోధ, శివరొరువంజి (యక్షగానం),  దశావతార వర్ణన మొదలైన రచనలు వెలువరించారు. దశావతార వర్ణనను తన 72వ యేట రచించారు. ఈమె రచనలు హితబోధిని, నీలగిరి, తెనుగు పత్రికల్లో చోటుచేసుకున్నాయి. 1929లో మరణించిన ఈమె రచనలు ఇప్పుడు ఒకటి అరా తప్ప అందుబాటులో లేవు. 1934లో వెలువడ్డ గోలకొండ కవుల సంచికలో అత్రాఫ్‌ బల్దా జిల్లాకు చెందిన మొత్తం 33 మంది కవుల రచనలు చోటుచేసుకోగా అందులో ఈమె రచనలు కూడా ఉన్నాయి. ‘సంసార తరణము’ శీర్షికన ఆమె రాసిన మూడు కంద పద్యాలు ఈ సంచికలో ఉన్నాయి. గాంధీని అవతార పురు షునిగా ఆమె రాసిన కవిత్వం 1924లో అచ్చయ్యింది. 1913 డిసెంబర్‌ హితబోధిని సంచికలో ఆమె రాసిన పద్యాలతో ఆమెను తొలి తెలంగాణ కవయిత్రిగా చెప్పొచ్చు. అంతకు ముందే ఆమె రచనా వ్యాసంగం చేపట్టినప్పటికీ అవి అందు బాటులో లేకపోవడంతో 1913ని ప్రామాణికంగా తీసుకోవ డమైంది. ఈమెను  తెలంగాణ కవితారంభానికి మాతృ మూర్తిగా ప్రతిష్టించి గౌరవించాల్సిన అవసరముంది. కందం, శార్దూలం, సీసం, తేటగీతి, ఆటవెలదుల్లో ఆమె పద్యాల్ని రాసింది. 

తరుణీకృత పాండిత్యము 
స్థిరమా యీమాట లంచు ఛేదింపకుడీ
హరియాజ్ఞగాక నాకీ కరణి
యుపన్యాసమొసగు జ్ఞానము గలదే

అచల మత ప్రచారకర్త జాలమాంబ
ఆధునిక మహిళల విషయానికి వస్తే దళితోద్యమ నేత భాగ్యరెడ్డి వర్మ మేనత్త రంగమ్మ 1880ల నాటికే క్రైస్తవ మతం పుచ్చుకుంది. భాగ్యరెడ్డి వర్మను చదువుకునేలా ప్రోత్సహించింది. దాదాపు ఇదే సమయంలో హైదరాబాద్‌లో అచల మతాన్ని ప్రచారం చేసిన తల్లావఝుల జాలమాంబ అనేక కీర్తనలు రాసింది. కొన్ని సీస పద్యాలు రాసింది. వాటిలో మచ్చుకు ఒక్కటి. కవిత్వంలో తప్పులుంటే ఎత్తి చూపాలని కోరింది.

సీ. గురుపుత్రులార మద్గురుమూర్తి స్తోత్రంబు
రచియింప బూను నా వచనములను
వినలేడ్కగలిగిన వినరయ్య వినిపింతు
తప్పులుండిన వాటి దాచబోక
దిద్దవలసినది మీ దేశికేంద్రుని మీద మీకు
భక్త్యున్నట్టె నాకు గలదు
గాని మీవలె నేను కవిత జేయగజాల
చాలనంచని విడజాలతోచి
నట్లు జేయుదు మీ రందరభయమిడిన
ననుచు విజ్ఞాపన మొనర్చి
యాజ్ఞగొంటి భాగవత వంశ భవకృష్ణ యోగి
రాజ ధీ విశారద మాకదేశి కేంద్ర

నేటి స్త్రీవాదికి తీసిపోని సుందరాబాయి
1900లకు ముందే వరంగల్‌లో స్త్రీల సమాజాలు ఏర్పాటయ్యాయి. ఈ పరంపరను హైదరాబాద్‌లో రావిచెట్టు లక్ష్మీనరసమ్మ కొనసాగించింది. తన ఇంట్లోనే విద్యావసతులు ఏర్పాటు చేయడమే గాకుండా గ్రంథాలయోద్యమానికి కూడా అండగా నిలిచారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ, ఆర్థికంగానూ తోడ్పడింది. గ్రంథాలయోద్యమ ప్రభావంతో చాలా మంది పాఠకులుగా మారారు. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఈ పాఠకులు తర్వాతి కాలంలో రచయిత్రులుగా మారినారు. వారిలో 1913లో ‘హితబోధిని’ పత్రికలో స్త్రీ విద్యావశ్యకత గురించి ఎస్‌.సుందరాబాయి వ్యాసాలు రాసింది. కవిత్వం కూడా అల్లింది. నిజా నికి ఈ పద్యం నేటి స్త్రీవాద రచనల కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. 

వెలుగులోకి రాని కవయిత్రులు
1928 నాటికే ఒక పద్మశాలి మహిళ ‘స్త్రీల విద్యావశ్యకత’ గురించి వ్యాసాలు రాసి ప్రజాచైతన్యానికి పాదులు వేసింది. ఆమె సికింద్రాబాద్‌కు చెందిన గిడుతూరి రామానుజమ్మ. 1934లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో ఒక డజన్ కు మించి కవయిత్రులు రికార్డు కాలేదు. అయితే ఆధునిక కాలంలో తెలంగాణ సోయితో జరిగిన పరిశోధనల్లో జాలమాంబ, సుందరీబాయి వెలుగులోకి వచ్చారు. వీరితో పాటుగా 1935లో గోలకొండ పత్రికలో మాడపాటి హనుమంతరావు పాఠశాల విద్యార్థినులు ఎ.లక్ష్మీదేవి, పి.సావిత్రి, కోమలవల్లి, కె.లక్ష్మీబాయమ్మ, వై.కౌసల్యాదేవి, వై.అమృతమ్మ, నేమాని భారతీ రత్నాకరాంబ, వై.కౌసల్యాదేవి, కె.నీరజాక్షి తదితరుల కవిత్వం చోటు చేసుకుంది. ఇందులో ఎక్కువ మేరకు శ్రీకృష్ణునిపైనే ఉన్నాయి. మాతృభారతి పత్రికలో కేవలం కృష్ణుడిపైనే గాదు ఏసుక్రీస్తుపైనా 1935లోనే కవిత్వాన్ని రాశారు. ఈ గీతాల్ని రాసింది కె.ఫ్లా్లరె¯Œ ్స. బహుశా ఈమె తొలి తెలంగాణ దళిత కవయిత్రి అయివుండే అవకాశమున్నది. దళిత కాకున్నా తొలి క్రైస్తవ స్త్రీగా చెప్పవచ్చు. ఈమె రాసిన రెండు పద్యాల్లో ఒకటి.

గీ. మా కొఱకు గాను నీ పుత్రు మమతజేసి
పంపితివి, కాని, యాయన, బాధలు వడె
దల్లి మరియమ్మ యెంతగా దల్లడిలెనొ
చిన్ని కొమరుడేసు క్రీస్తు సిలువ మోయ

1933 నాటికే తెలంగాణ నుంచి ఒక స్త్రీ ప్రణయ కవిత్వం రాయడం విశేషం. ఈ కావ్యం ‘కావ్యావళి’. ఖమ్మం జిల్లాకు చెందిన ఇందుమతీదేవి రాశారు. ఈ కవితా సంపుటి 1936లో విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం ముందుమాటల్తో వెలువడింది. ఈ పద్యాల్లో ఒక వైపు భర్తను, మరోవైపు దేవుడిని ఇద్దరినీ కొలుస్తూ ‘శ్లేష’ వచ్చే విధంగా కవిత్వమల్లింది.

పావనంబగు మీమూర్తి వదల కెపుడు
చిత్తసింహాసనము నధిష్టింపజేసి
ప్రణయసామ్రాజ్యపట్టభాస్వన్మహోత్స
వము గావించెదను ప్రమోద మ్మెలర్ప

వీళ్ళే గాకుండా తత్వాలు చెప్పిన మనుసాని వెంకట లక్ష్మమ్మ, చిగుళ్ళపల్లి సీతమ్మ, మక్థల్‌ సుశీలమ్మ ఇట్లా ఎందరో ఉన్నారు. 1857–1956 మధ్య శతాబ్ది కాలంలో తెలంగాణలోని స్త్రీలు రాసిన లేదా చెప్పిన కవిత్వం రికార్డయినట్లయితే ఆనాటి మహిళా ప్రతిభ, సాహిత్యం, విరహం, మోహం, సరసం, ఆధునికత, అక్షర జ్ఞానం, ఎఱుక ఎలా ఉండేదో అర్థమయితది.

చిన్న వాక్యాలు రాయడమే మంచిది
మాట్లాడేభాషలో ఎప్పు డూ పెద్ద పెద్ద వాక్యాలు వుండవు. ఎవరైనా మాట్లాడుతూ వున్నప్పుడు చూడండి. మామూలుగా మాట్లాడేటప్పు డైనా, కోపంగా మాట్లాడేటప్పుడైనా, ఆ మాటలన్నీ చిన్న చిన్న వాక్యాలుగానే వుంటాయి. భాష ఎప్పుడూ చిన్న చిన్న వాక్యాలుగా వుండడమే మాట్లాడే భాషలో వుండే సూత్రం. ఈ సూత్రాన్నే రాసే భాషలో కూడా పాటించాలంటే, రాసే భాష కూడా చిన్న చిన్న వాక్యాలతోనే వుండాలి. అలావుంటే అది, మాట్లాడే భాషలాగా తేలిగ్గా అర్థమవుతూ వుంటుంది.     ..: రంగనాయకమ్మ

ఎవరి ప్రత్యేకత వారిది
కవిత్వంలో రసోన్ముఖంగా సాగే అంశాలు ముఖ్యంగా నాలుగు. అవి– అలంకారాలు, గుణాలు, రీతులు, వృత్తులు. ప్రసిద్ధ కవులు తమ కవితా శైలులలో ఈ నాలుగింటిలో ఏదో ఒక దానికి ప్రాముఖ్యాన్ని కల్పించి తమ ప్రత్యేకతలను నిలుపుకొంటూ ఉంటారు. ఈ దృష్టితో సమీక్షిస్తే కవిత్రయం వారిది గుణప్రధానశైలి. శ్రీనాథునిది రీతి ప్రధాన శైలి. ప్రబంధ కవులది అలంకార ప్రధాన శైలి. నాటకీయతను పోషించిన తిక్కనాదులలో వృత్తులకు ప్రాముఖ్యం కనపడుతుంది. 
..: జి.వి.సుబ్రహ్మణ్యం

అస్పృశ్యులకూ, స్త్రీలకూ అల్లంత దూరంలో ఉన్న అక్షరాన్ని అడ్డంకులను దాటుకుని, అక్షరాలను గుండెలకు అదుముకుని, హృదయాలతో హత్తుకుని సాహిత్యానికి సంపూర్ణత్వాన్ని అద్దిన స్త్రీలెం దరో తెలుగు వెలుగుని దశదిశలా ప్రసరించారు. అక్షరాన్ని కమ్మేసిన పురు షాధిపత్యపు పొరలను చీల్చుకుని తమకు తాముగా ప్రకాశించేందుకు ఎన్నో సాహసాలూ, మరెన్నో త్యాగాలనూ మూటగట్టుకున్న తెలుగు సాహితీ ప్రపంచం మొన్నటి మొల్ల నుంచి, నిన్నటి రంగనాయకమ్మ, ఓల్గా, విమల, నేటి సుభద్ర, వినోదిని లాంటి స్త్రీవాద, దళిత రచయిత్రుల వరకు పరుచుకున్న అనుభవం ఘనమైనది.

మొల్ల...: తన కావ్యం అర్థంకాని భాషలో మూగ, చెవిటి ముచ్చట కాకూడదని సులభమైన జానుతెలుగు రామాయణాన్ని రచించిన మొల్ల మన తెలుగు మల్లె. లాలిత్యానికీ, సుకుమారానికీ ప్రతీకైన సిరిమల్లెకాదీమె రాయల రాజులకు తన కావ్యాన్ని అంకితమిచ్చేందుకు తిరస్కరించి, తనకి ఇష్టుడైన రాముడికే తన రామాయణాన్ని అంకితమిచ్చిన నాటి స్త్రీల ఆత్మగౌరవ ప్రతీక.  
ముద్దుపళని: ఇరవయ్యవ శతాబ్దారంభంలో చర్చనీ యాంశమైన ‘రాధికా స్వాం తనం’ను ఆత్మకథగా రాసిన ముద్దుపళని తంజావూరు నాయక రాజులైన ప్రతాప సింహుడి వద్ద(1739–63) రాజనర్తకి. స్వేచ్ఛా వ్యక్తిత్వానికీ, స్వతంత్ర నిర్ణయాలకూ ప్రతీక. 
రంగనాయకమ్మ: పెట్టుబడిదారీ విధానపు శ్రమదోపిడీ గుట్టుని రట్టుచేసిన కారల్‌ మార్క్స్‌‘పెట్టుబడి’ని అత్యంత సులువుగా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో తెలుగు ప్రజలకు పరిచయం చేసిన మహా రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన తీరు అసాధారణమైనది. వర్గదృక్పథాన్ని అందించిన రంగనాయకమ్మ స్ఫూర్తి ప్రతి తెలుగు గుండెలోనూ ప్రతిధ్వనిస్తుంది. ‘జానకివిముక్తి’ చలం తర్వాత స్త్రీలోకాన్ని చైతన్యపరిచిన తొలిపుస్తకం. ‘రామాయణ విషవృక్షం’, మూఢనమ్మకాలపై ఆమె రాసిన విమర్శనాత్మక పుస్తకం ‘తులసీదళం కాదది గంజాయి దమ్ము, స్త్రీ, రచయిత్రి, ‘ఇదే నా న్యాయం’, ఎన్నో నవలలూ, విమర్శనాత్మక వ్యాసాలూ  తెలుగు సమాజానికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించాయి.
ఓల్గా: ఆధునిక స్త్రీల అస్తిత్వ ఉద్యమానికి ఓల్గా రచనలే పునాది. ఓల్గా రచనల్లో తొలి ముద్రితం 1969 పైగంబర కవిత్వం. స్త్రీలను అమితంగా ప్రభావితం చేసిన నవలల్లో ‘స్వేచ్ఛ’,‘రాజకీయ కథలు’, ‘నేనూ – సావిత్రీబాయిని’, ‘యుద్ధమూ –శాంతి’, ‘లక్ష్మణరేఖ’, వసంతకన్నాభిరాన్, కల్పనకన్నాభిరాన్, ఓల్గా కలిసి రాసిన ‘మహిళావరణం’ తెలుగు సాహితీరంగాన్ని గొప్ప మలుపుతిప్పాయి. 
అయితే ఇప్పటి వరకూ వచ్చిన స్త్రీవాద రచనలన్నీ అగ్రవర్ణ స్త్రీలు రాసినవనీ, సతి, వితంతువివాహం దళిత స్త్రీల జీవితాల్లో లేవనీ, అగ్రవర్ణ స్త్రీల సమస్యలపై రాసింది దళిత స్త్రీల సాహిత్యం కాదని, జూపాక సుభద్ర, గోగు శ్యామల, వినోదిని వంటివారు జోగినీ వ్యవస్థ,  అస్పృశ్యత, సామాజిక హింస, పాకీపని, లాంటి వెలివేతల వెతలను ప్రశ్నిస్తున్నారు. జూపాక సు¿¶ ద్ర రాసిన ‘అయ్యయ్యో దమ్మక్క, రాయక్క మాన్యం, నల్లరేగడి సాల్లు, కైతునకల దండెం ఆ కోవలోనివే. అంబేడ్కర్‌ జీవిత చరిత్రను తెలుగులో రాసిన డాక్టర్‌ విజయభారతిగారి కృషినీ మరువలేం. 

రేవతీదేవి, జయప్రభ,  కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, పాటిబండ్ల రజని, కె.గీత, మహెజాబీన్, శిలాలోలిత, మందరపు హైమావతి, పసుపులేటి గీత, షాజహానా కవిత్వం, కుప్పిలిపద్మ రచనలు తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఇటు వర్గదృక్పథం, అటు స్త్రీవాదాన్ని అంతే బలంగా వినిపించారు  విమల మోర్తల. విమల రాసిన  ‘వంటగది’ కవిత, ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ స్ఫూర్తినినింపాయి. 
తెలంగాణ బిడ్డ, మహిళోద్యమ ఆవిర్భావకురాలు డాక్టర్‌.కె.లలిత, ప్రొఫెసర్‌  సుజీతారూ కృషిని తెలుగు ప్రజలు దారులేసిన అక్షరాల్లో వెతుక్కోవచ్చు. కె.లలిత రాసిన ‘సవాలక్ష సందేహాలు’ గతంలో ఎవ్వరూ తడమని ఎంతో విలువైన గ్రంధం, కె.లలిత, వసంతాకన్నాభిరాన్, సుశీతారూ బృందం అందించిన గొప్ప పరిశోధనాత్మక గ్రంధం ‘మనకు తెలియని మన చరిత్ర’ భారతీయ సమాజంలో ఎనలేని కృషి చేసీ, మరుగునపడిన  బెంగళూరు నాగరత్నమ్మ లాంటి ఎందరో స్త్రీల చరిత్రలను వెలికితీసిందిది.
స్త్రీవాద చరిత్రకారిణిగా బండారు అచ్చమాంబను తెలుగు సమాజం గుర్తుచేసుకుంటుంది.  బహుభాషా కోవిదురాలైన అచ్చమాంబ రాసిన ‘అబల సచ్చరిత్ర రత్నమాల’ (1901) స్త్రీల చరిత్రలను వెలికితీసింది.
తెలుగు ప్రజలు సగర్వంగా చెప్పుకునే కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. నాలుగున్నర దశాబ్దాల క్రితమే రుతుక్రమాన్ని సైతం అస్పృశ్యంగా మార్చిన వైనంపై తన ‘మూన్నాళ్ళ ముచ్చట’లో రాయడం గొప్పసంగతి. చిన్న కునుకు కోసం స్త్రీ జీవితాంతం పడే తపనని ‘సుఖాంతం’ కథ ఆవిష్కరిస్తుంది.    
..: అత్తలూరి అరుణ
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top