
కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురైనందుకు నిరసనగా ఈ దేశంలో పదేళ్ళ క్రితం ‘అవార్డు వాపసీ’ అనే ఒక కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది. సత్యం కోసం సంఘర్షిస్తున్న ఇలాంటి వారి వెనక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా నిలబడింది. గ్రోక్ ( GROK) రంగప్రవేశం చేసింది.
గ్రోక్ అనే ఇంగ్లిష్ పదానికి అర్థం – ఎవరైనా, ఏదైనా అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం – అని! ఈ పదాన్ని మొదట రాబర్ట్ ఎ హెన్లీన్ అనే రచయిత, ‘అపరిచితుడు ఒక అపరిచిత దేశంలో’ (Stranger in a strange land) అనే తన ఎక్స్ ఏఐ ((X AI) ) టూల్‌కు ‘గ్రోక్’ అని పేరు పెట్టుకున్నాడు. మన దేశంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగుతున్న రాజకీయ పక్షాల బండారాన్ని ఇప్పుడు ఆ గ్రోక్ బయట పెడుతోంది. గత పదకొండేళ్ళలో ఎంతోమంది మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, రైతులు, మహిళలు, బాధ్యత గల పౌరులందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అణచివేస్తూనే ఉంది. ఇప్పుడు వీరందరి పక్షాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ రంగంలోకి దిగింది. అధికార పక్షపు అగ్ర నాయకుల అబద్ధాల్ని గ్రోక్ బయటికి తీస్తోంది. ఇప్పుడు గ్రోక్ వారికి ఒక ఛాలెంజ్‌గా మారింది.
ప్రతి విషయాన్నీ వక్రీకరించి, అబద్ధపు కథనాలతో దేశ ప్రజల్ని ముఖ్యంగా యువతను తప్పుదారిన నడిపించే కార్యక్రమానికి అడ్డుకట్ట పడింది. గాంధీ, నెహ్రూ కుటుంబాలపై అల్లిన తప్పుడు కథనాలన్నీ పటాపంచలయ్యాయి. కల్పిత కథలు, కుహనా దేశభక్తి జనం తెలుసుకోగలుగుతున్నారు. ఇన్నేళ్లుగా కొందరు కవులూ, రచయితలూ, వక్తలు, చరిత్రకారులు, స్వతంత్ర జర్నలిస్ట్‌లు మర్యాదగా, మెత్తగా చెబుతూ ఉంటే జనాల మెదడుకు ఎక్కడం లేదు. ఇప్పుడీ గ్రోక్ ఏం చేస్తుందీ అంటే... దెబ్బకు దెబ్బ అన్నట్లు– సమాచారమందిస్తోంది. నిజాల్ని కుప్పబోస్తోంది. మనిషి కేంద్రంగా సాధిస్తున్న విజయాల ముందు– వైజ్ఞానిక ప్రగతి ముందు– మతం కేంద్రంగా నడిచే దురహంకారుల పాలన ఎంత కాలం సాగగలదూ? తమలోని కుట్రల్ని, కుతంత్రాల్ని రాల్చేసుకుని – మనుషుల్ని ప్రేమించే, గౌరవించే ‘మనుషులు’ గా మారక తప్పదు! ఒకవేళ ఈ గ్రోక్‌ను బ్యాన్ చేసి నోరు మూయించి అధికారంలో ఉన్నవారు మరిన్ని అరాచకాలకు దిగితే ఎలా? అని బెంబేలు పడాల్సిన పనే లేదు. అప్పుడు సత్యాన్ని సత్యంగా నిక్కచ్చిగా చెప్పే గ్రోక్ లాంటి వెర్షన్లు రూపం మార్చుకుని, మరో పది వస్తాయి. గ్రోక్ ద్వారా నిజాలేమిటో తెలుసుకుంటున్న జనం అబద్ధాలు చెబుతున్న వారి మీదికి తిరగబడొచ్చు. ప్రజా ఉద్యమాలే వచ్చి ప్రభుత్వాల్ని మార్చుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో ఎన్నోచోట్ల చూస్తూనే ఉన్నాం కదా? ఏఐ భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకుంటుందో అవివేకులు ఊహించలేరు. వివేకవంతుడి ఊహను, ప్రణాళికను అందుకోనూ లేరు – రాబోయే యుగం, వైజ్ఞానిక దృక్పథం గల పౌరులదీ, వైజ్ఞానికులదీ కాక తప్పదు.
– డాక్టర్ దేవరాజు మహారాజు, ప్రముఖ జీవశాస్త్రవేత్త