అగ్నిమాపక శాఖలో.. డొల్లతనం

Fire department Failures in Nampally Exhibition Incident - Sakshi

నుమాయిష్‌లో అగ్ని ప్రమాద ఘటన

వెలుగు చూసినపలు సమస్యలు..

పాఠాలు నేర్వకుంటే భవిష్యత్‌లో అనర్థాలే

సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌ సిటీగా పేరొందిన గ్రేటర్‌ సిటీలో ప్రమాదవశాత్తు అగ్నికీలలు ఎగిసిపడితే మంటలను ఆర్పే అగ్నిమాపక శాఖకు ఆపదొచ్చింది. నాంపల్లి నుమాయిష్‌లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించిన నేపథ్యంలో.. ఈ శాఖకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు హాట్‌టాపిక్‌గా మారాయి. అగ్నిప్రమాదాలు జరిగినపుడు క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకోవడం మొదలు.. అందుబాటులో నీటి వసతి ఉండడం.. అధిక ఒత్తిడితో ఆ నీటిని వెదజల్లేందుకు అవసరమైన సాధనా సంపత్తి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం.. ఉన్న యంత్రాలు పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయకపోవడం తదితర సమస్యలు ఆ శాఖలోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితిని తక్షణం చక్కదిద్దని పక్షంలో భవిష్యత్‌లో మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం పొంచి ఉందని గ్రేటర్‌వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 అనుభవాల నుంచిపాఠాలు నేర్చేనా..?
బుధవారం రాత్రి నుమాయిష్‌ వద్ద దుర్ఘటన జరిగిన సమయంలో రెండు ఫైర్‌ ఇంజిన్లున్నాయి.  ఇందులో ఒకదాంట్లో నీళ్లు లేవు. రెండోదాంట్లో సగం నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో లోప్రెజర్‌ (తక్కువ ఒత్తిడి)తో నీటిని వెదజల్లారు. ఈ నీరు సైతం కేవలం 3–4 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విరజిమ్మారు. దీంతో అగ్నికీలలు అదుపులోకి రాలేదు. ఎగ్జిబిషన్‌లోని మహేష్‌ బ్యాంక్‌ ముందు విద్యుత్‌ స్తంభం 12 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడే షార్ట్‌ సర్క్యూట్‌ రాత్రి 8.40 గంటలకు సంభవించింది. స్థానిక దుకాణాదారులు ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. నుమాయిష్‌ సమీపంలోనే ఉన్న ఫైరింజిన్లు ఘటనాస్థలికి చేరుకునేందుకు 10–15 నిమిషాల సమయం పట్టడంతో ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అక్కడికి చేరుకున్న ఫైరింజిన్లకున్న వాల్వ్‌లు సైతం దీర్ఘకాలంగా వినియోగించకపోవడంతో తుప్పుపట్టాయి. ఇవి సమయానికి తెరచుకోకపోవడం గమనార్హం. ఈ సంఘటనలో ఓ ఫైర్‌అధికారి సైతం గాయపడడం ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికే భద్రత కరువైన అంశాన్ని తేటతెల్లంచేస్తోంది.  నీళ్లు విరజిమ్మేందుకు ఏకంగా గంట సమయం పట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  తొలుత ప్రవేశించిన రెండు ఫైరింజన్లపై పనిచేస్తున్న సిబ్బంది,అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో మంటలను ఏ వైపు నుంచి అదుపుచేయాలో పాలుపొక తికమకపడడం గమనార్హం.  

ఎక్కువ సమయంపట్టడంతోపెరిగిన తీవ్రత..
రాత్రి 8.40 నుంచి 11.20 గంటల వరకు దాదాపు 19 ఫైరింజిన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను క్రమంగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలను సైతం ప్రణాళికాబద్ధంగా మోహరించకపోవడంతో మంటలను ఆర్పేందుకు ఎక్కువ సమయం పట్టింది. మరోవైపు ఆయా వాహనాలకున్న నీటిని విరజిమ్మాల్సిన పైపులకు, జాయింట్లకు సైతం చిల్లులు పడడంతో సగం నీరు వృథా అయ్యింది. దీంతో గంటలో ఆర్పాల్సిన మంటలను మూడుగంటల సమయం పట్టడం గమనార్హం. ఈ సమయంలో జలమండలి 30 ట్యాంకర్ల నీటిని ఘటనాస్థలికి పంపించినప్పటికీ.. ఈ నీటిని సకాలంలో ఫైరింజిన్లలో నింపే విషయంలో ఫైర్‌సిబ్బంది విఫలమయ్యారు. పలు ఫైరింజిన్లకు నీటిని నింపే మోటార్లు సకాలంలో పనిచేయకపోవడం స్పష్టంగా కనిపించింది. ఇక మంటలను పూర్తిస్థాయిలో అదుపుచేయకపోవడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రదేశాల్లో తిరిగి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్‌సిబ్బంది తిరిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.  

ఎలాంటి లోటుపాట్లు లేవు..
నుమాయిష్‌లో మంటలను ఆర్పేందుకు సుమారు 100 మంది ఫైర్‌సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారులు మా సిబ్బందిని తికమకపెట్టడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. నగరంలో మాకు 15 ఫైర్‌స్టేషన్లు..30 ఫైర్‌ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. మా శాఖలో 400 మంది వరకు పనిచేస్తున్నారు. ఫైర్‌ ఇంజిన్లకు అవసరమైన నీటి వసతి అందుబాటులో ఉంది. వాహనాల్లో ఎలాంటి లోటుపాట్లు లేవు.  
– శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాఅగ్నిమాపక శాఖ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top