మెట్రో: లేడీస్‌ సీట్లో కూర్చుంటే రూ.500 జరిమానా | Sakshi
Sakshi News home page

ఫైన్‌ పడుద్ది

Published Tue, Oct 23 2018 10:58 AM

Fine On Genes Using Ladies Seats In Hyderabad Metro - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో రైళ్లలో మహిళలకు కేటాయించిన సీట్లలో పురుషులు, ఇతరులు కూర్చుంటే వారికి రూ.500 జరిమానా తప్పదని హైదరాబాద్‌ మెట్రో రైలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రసూల్‌పురాలోని మెట్రో రైల్‌ భవన్‌లో మెట్రో అధికారులు, ఎల్‌ అండ్‌టీ ఉన్నతాధికారులతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే వారికి జరిమానా విధించాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఈ విషయంలో ప్రతి మెట్రో బోగీలో  ఎల్‌అండ్‌టీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు నిఘాను పెంచాలని ఆదేశించామన్నారు.

మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు తమకెదురైన అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ వాట్సప్‌ నంబరు కేటాయించాలని ఎల్‌అండ్‌టీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లు, పరిసర ప్రదేశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలని, స్టేషన్‌ పరిసరాలను అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎన్వీఎస్‌ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం మెట్రో టౌన్‌ ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని అధికారులు ఎప్పటికప్పుడు మెట్రో ప్రయాణికులకు, పాదచారులకు ఎలాంటి అసౌకర్యం కలగనిరీతిలో కృషి చేయాలని అన్నారు.

ఎల్‌బీ నగర్‌ నుంచి మియాపూర్‌ వరకూ, నాగోల్‌– అమీర్‌పేట్‌ వరకూ గల మెట్రోమార్గంలో మెట్రో స్టేషన్ల పరిసరాలలో ఇంకా మిగిలివున్న సివిల్‌ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే తగిన అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం అధికారులను మెట్రో ఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్‌అండ్‌ టీ మెట్రోరైలు మేనేజింగ్‌ డైరక్టర్, కె.వి.పి.రెడ్డి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు అనిల్‌ సహాని, చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆనందమోహన్, హైదరాబాద్‌ మెట్రోరైలు ఉన్నతాధికారులు విష్ణువర్థన్, బి.యన్‌.రాజేశ్వర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement